జల్లికట్టు

16 Jan, 2017 23:16 IST|Sakshi
జల్లికట్టు

జల్లికట్టు అభిమానులు ఆ సంప్రదాయం పట్టు వీడకూడదని గట్టి పట్టు పట్టారు. త్రిష ట్విట్టర్‌ని ఎవరో పట్టుకుని కొత్త కట్టు తెచ్చారు. ఇలాంటి విషయాల్లో పట్టూ విడుపూ ఉండాలని ఎవరైనా అంటే..జల్లికట్టు అభిమానులు పట్టు బిగిస్తున్నారు. దీంట్లో త్రిషకి వచ్చిన పాట్లు గురించి ఈ ‘జల్లిపట్టు’ కథనం.

ప్రగాఢ సానుభూతి
త్రిష అకాల మరణం...
దానికి కారణం హెచ్‌ఐవి...
త్రిష తండ్రి ఒక... (రాయకూడదని పదం)
త్రిష తల్లి ఒక... (రాయకూడని పదం)


మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న దారుణాతి దారుణమైన వార్తలివి. ఇది అసత్య ప్రచారం అని వార్త వచ్చిన మొదటి రోజే అందరూ ఊహించారు. ఇంత ఘోరంగా త్రిషను అవమానపరచడానికి కారణం ‘జల్లికట్టు’ అనే తమిళనాడు సంప్రదాయం. అంటే.. ఇంగ్లిష్‌లో ‘బుల్‌ టేమింగ్‌’. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తారు. ఇది సాహస క్రీడ. పోటీలో పాల్గొనే వ్యక్తుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఎడ్లకు కూడా ప్రమాదకరమే. అందుకే ఈ క్రీడను నిషేధించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుని ‘పెటా’ (జంతు హక్కుల సంరక్షణ సంస్థ) ఆశ్రయించింది. కోర్టు కూడా నిషేధం విధించింది. దాంతో ‘మన సంప్రదాయంపై నిషేధమా’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. ఈ వివాదంలోకి త్రిష పేరు రావడం, ‘జల్లికట్టు’ మద్దతుదారులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. ఇలా నానా రభసా అయింది. అసలు త్రిష ఈ వివాదంలో ఎలా ఇరుక్కున్నారంటే...

వివరణ ఇచ్చినా సద్దుమణగలేదు
‘‘నేను ‘పెటా’ని సపోర్ట్‌ చేస్తున్నా. మూగజీవాలు హింసకు గురవుతున్నప్పుడు, అది ఎంత పాత సంప్రదాయమైనా సరే నేను సపోర్ట్‌ చేయను. ‘జల్లికట్టు’ని నిషేధించాలి’’ అని తన ట్విట్టర్‌లో త్రిష పేర్కొనడం పెద్ద వివాదం అయింది. ‘మన సంప్రదాయాన్ని కాదనడానికి నువ్వెవరివి?’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా త్రిషపై జల్లికట్టు మద్దతుదారులు నిప్పులు చెరిగారు. ఆ క్రమంలో ‘త్రిష చనిపోయింది’ అని ప్రచారం మొదలుపెట్టారు. ‘ఒకరేమో తప్ప తాగి సంప్రదాయాన్ని రోడ్డుకు తెచ్చిన అమ్మాయి, ఇంకొకరు ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయాన్ని (వ్యంగ్య ధోరణి) విస్తరింపజేస్తోన్న అమ్మాయి. వీళ్లిద్దరూ ‘పెటా’కి ప్రచారకర్తలా? సిగ్గు.. సిగ్గు..’ అంటూ త్రిష ఫొటోను, ఒకప్పటి నీలి చిత్రాల తార, ఇప్పుడు హిందీ సినిమాలు చేస్తోన్న సన్నీ లియోన్‌ ఫొటోలు పెట్టి... ఇద్దరు ముద్దుగుమ్మలనూ తూలనాడారు. సన్నీ వరకూ విషయం వెళ్లే అవకాశం లేదు కానీ, చెన్నై చందమామ త్రిషకు ఈ వివాదానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే.. ‘‘నా ట్విట్టర్‌ అకౌంట్‌ని ఎవరో హ్యాక్‌ చేశారు. జల్లికట్టుకి వ్యతిరేకంగా వాళ్లే వ్యాఖ్యానించారు. అవి నేను చేసిన వ్యాఖ్యలు కాదు. మన సంప్రదాయం అయిన ‘జల్లికట్టు’ని నిషేధించమని నేనెందుకు అంటాను’’ అని ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. జల్లికట్టుని ఆపకూడదని విస్తృతంగా ధర్నాలు చేస్తున్నవాళ్లల్లో కొంతమంది త్రిషపై దాడికి దిగారు.

కారైకుడిలో కలకలం
త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘గర్జనై’ షూటింగ్‌ ఇటీవల తమిళనాడులోని కారైకుడిలో జరిగింది. ఈ షూటింగ్‌ లొకేషన్‌కు జల్లికట్టు మద్దుతుదారులు భారీ ఎత్తున వెళ్లారు. త్రిషపై దాడికి ప్రయత్నించారు. షూటింగ్‌ ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. దాంతో అప్పటికప్పుడు షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పేశారు. చివరికి పోలీసుల సహాయంతో త్రిష అక్కణ్ణుంచి సేఫ్‌గా బయటపడ్డారు.  ‘‘ఒక మహిళను ఇంతలా అవమానించడం తమిళ సంప్రదాయమా? మిమ్మల్ని మీరు తమిళులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. తమిళ సంప్రదాయం గురించి మాట్లాడటానికి కూడా మీకు అర్హత లేదు’’ అంటూ ట్విట్టర్‌ ద్వారా త్రిష తన ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. చివరికి ట్విట్టర్‌ అకౌంట్‌నే ‘డీయాక్టివేట్‌’ చేసేశారు. ఆ తర్వాత ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే..

త్రిష ఇక డీ–యాక్టివ్‌!
‘‘తమిళనాడు ప్రజలకు నా మనసులోని మాటలు చెబుతున్నా. నా తప్పేం లేకపోయినా నేను నిందలపాలయ్యాను. ‘జల్లికట్టు’ని నేను వ్యతిరేకించలేదని ట్విట్టర్‌ ద్వారా స్పష్టంగా ప్రకటించాను. తమిళనాడులో పుట్టినందుకు గర్వపడుతున్నా. తమిళ సంప్రదాయం అంటే నాకు చాలా గౌరవం. నా సొంత మనుషుల మనోభావాలను, నమ్మకాలను నేను అగౌరవపరుస్తానా? నా ఎదుగుదలకు కారణమైన వారి సెంటిమెంట్స్‌ అంటే నాకు చిన్న చూపు ఉంటుందా? నేను అభిమానించే నా తమిళ ప్రజలను బాధపెట్టేట్లు నా ట్విట్టర్‌ ద్వారా జల్లికట్టు గురించి ఎవరో చేయకూడని వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా ప్రజలకు, నాకూ మధ్య చిచ్చు రేపాలనుకున్నారు. కానీ, మన బంధం బలమైనది. ఇలాంటి సంఘటనలు మనల్ని వేరు చేయలేవు. నా ట్విట్టర్‌ హ్యాక్‌కి గురైన విషయం తెలుసుకోగానే కొత్త ‘పాస్‌వర్డ్‌’ సెట్‌ చేసుకున్నాను. జరిగిన సంఘటనకు బాధపడుతున్నాను. ఎంతో ఆవేదనతో నా ఫీలింగ్స్‌ని మీతో పంచుకున్నాను. మనస్ఫూర్తిగా ఇంకోసారి చెబుతున్నా.. నా ప్రజలను నేనెందుకు బాధపెడతాను. ఈ వివాదంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’’ అని త్రిష పేర్కొన్నారు. ట్విట్టర్‌ అకౌంట్‌ని మళ్లీ ఎప్పుడు ‘యాక్టివ్‌’ చేస్తానో తెలియదన్నారామె. ఇదిలా ఉంటే.. త్రిష ట్విట్టర్‌ అకౌంట్‌ని ఎవరు హ్యాక్‌ చేశారో దర్యాప్తు చేయాల్సిందిగా ఆమె తల్లి ఉమాకృష్ణన్‌ పోలీసులను కోరారు. మొత్తం మీద కొత్త సంవత్సరం ప్రారంభంలో త్రిషకు పెద్ద చేదు అనుభవమే ఎదురైంది అనాలి.

‘పెటా’ను ప్రశ్నించిన ఖుష్బూ
‘జల్లికట్టు’ని వ్యతిరేకించిన ‘పెటా’ సంస్థను నటి ఖుష్బూ సూటిగా ఓ ప్రశ్న అడిగారు. ‘‘శివుడి వాహనం నందిని ఇన్‌సల్ట్‌ చేసినట్లుగా ‘పెటా’ పేర్కొంది. మరి.. వినాయకుడి స్నేహితుడు అయిన మూషికాన్ని గౌరవించరా’’ అని ఆమె అడిగారు. (మెడికల్‌ సైన్స్‌లో ఎలుకల మీద ప్రయోగాలు చేస్తున్న విషయాన్నే ఖుష్బూ ఇలా ప్రస్తావించి ఉంటారని ఊహించవచ్చు) ఇప్పుడు ‘జల్లికట్టు’ని మేం వ్యతిరేకిస్తున్నాం అని నిందిస్తే ఊరుకోం. ఆ ట్రెడిషన్‌ మీద మాకు గౌరవం ఉంది. ఎవరో ఓ మెడికో... కుక్కను బిల్డింగ్‌ మీద నుంచి విసిరేసినప్పుడు మేమంతా దాన్ని వ్యతిరేకించాం. అప్పుడీ ‘పెటా’ ఎక్కడుంది? ‘జల్లికట్టు’లో మీరు ఐదు తప్పులు చూస్తే.. మేం ఎందుకు మద్దతు ఇస్తున్నాం అనేదానికి 50 వేల ఒప్పులు చూపిస్తాం’’ అన్నారు.

త్రిషను నిందించడం తగదు
సీనియర్‌ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ నుంచి యువహీరోలు ధనుష్, శింబు వరకూ ‘జల్లికట్టు’కి మద్దుతు ఇచ్చారు. ‘‘ఎప్పటి నుంచో ఆచరిస్తున్న సంప్రదాయాన్ని ఎలా కాదంటాం?’’ అని కమల్, రజనీ పేర్కొన్నారు. అలాగే, త్రిషని తూలనాడటం సరికాదని కూడా పేర్కొన్నారు. ఇంకా నటుడు అరవింద్‌ స్వామి, దర్శకుడు సెల్వరాఘవన్, నటి రాధిక, ఆమె భర్త, నటుడు శరత్‌కుమార్‌ తదితరులు త్రిషకు ఆదరణగా నిలిచారు. ‘జల్లికట్టు’ గురించి మాట్లాడుతూ, నటుడు ఆర్య ‘వాట్‌ ఈజ్‌ జల్లికట్టు’ అని చేసిన ట్వీట్‌ ఈ యువహీరోని వివాదాలపాలు చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా