‘నో టైమ్‌ టు డై’కి ఇది సమయం కాదు!

3 Mar, 2020 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని నేడు కొవిడ్‌ వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ‘నో టైమ్‌ టు డై’ అనే 25వ జేమ్స్‌ బాండ్‌ చిత్రం విడుదలతోపాటు, దాని ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాల్సిందిగా జేమ్స్‌ బాండ్‌ చిత్రాల అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు అభిమానుల వెబ్‌సైట్‌ ‘ఎంఐ6–హెచ్‌క్యూ’ చిత్రం పంపిణీదారులైన ‘ఎంజీఎం, యూనివర్శల్‌’ సంస్థలు ఓ లేఖ రాసింది. లండన్‌తోపాటు యూరప్‌లో మార్చి 31వ తేదీన, ఉత్తర అమెరికాలో ఏప్రిల్‌ పదవ తేదీన, చైనాలో ఏప్రిల్‌ 30వ తేదీన విడుదలకు ఏర్పాట్లు చేశారు. (‘కరోనాపై భయపడాల్సిన అవసరం లేదు’)

కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనాలో ‘నో టైమ్‌ టు డై’ చిత్రం విడుదలను ఇప్పటికే నిలిపి వేశారు. అలాగే చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను నిలిపివేశారు. అయితే లండన్‌లో, ఇతర దేశాల్లో చిత్రం విడుదలనుగానీ, ప్రమోషన్‌ కార్యక్రమాలనుగానీ నిలిపి వేయలేదు. అందుకనే జేమ్స్‌ బాండ్‌ చిత్రాల అభిమానుల వెబ్‌సైట్‌ ఓ లేఖను రాసింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సినిమా హాళ్లను మూసివేసే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా చిత్రం విడుదలను ముందుగానే వాయిదా వేసుకోవడం మంచిదని ఆ లేఖలో అభిమానులు కోరారు. 

లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో మార్చి 31వ తేదీన ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్‌ షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ హాల్‌లో ఐదువేల మంది ప్రేక్షకులు పడతారు. కొవిడ్‌ వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ప్రజలు ఒకచోట గుమికూడడాన్ని నిషేధించిన విషయం తెల్సిందే. అమెరికా, లండన్‌లో ఇప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ మున్ముందు తీసుకునే అవకాశం ఉంది. (అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్‌–19 దెబ్బ)

మరిన్ని వార్తలు