జేమ్స్ బాండ్ కథ చోరీ!

14 Dec, 2014 22:24 IST|Sakshi
జేమ్స్ బాండ్ కథ చోరీ!

 జేమ్స్ బాండ్... నేర పరిశోధనలో వీర పనితనం చూపించే ఈ కారెక్టర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు. బాండ్ బరిలోకి దిగాడంటే విలన్లు బాప్‌రే అని పారిపోవాల్సిందే. బాండ్ చేసే వీరోచిత విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. అందుకే ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొచ్చినా విసుగు లేకుండా చూశారు. ఇప్పుడు  24వ బాండ్ రానున్నాడు. ఈ చిత్రం ఇటీవలే లండన్‌లో ఆరంభమైంది. ‘స్పెక్ట్రె’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. అయితే... కథ తస్కరణకు గురి కావడం చిత్రబృందాన్ని షాక్‌కు గురి చేసింది.
 
 ఈ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థ అయిన సోనీ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న ‘స్పెక్ట్రె’ కథను హాకర్స్ దొంగిలించారు. కానీ, చిత్రబృందానికి ఊరటనిచ్చే విషయం ఏంటంటే... ఈ కథకు కాపీ రైట్ రక్షణ ఉందట. ఒకవేళ ఎవరైనా ఈ కథను కాపీ కొట్టడానికి ప్రయత్నించినా, ఇందులోని సన్నివేశాలను పోలిన సన్నివేశాలు తీసినా చట్టరీత్యా నేరమవుతుందని సోనీ సంస్థ ప్రతినిథి పేర్కొన్నారు. కథను తస్కరించినంత మాత్రాన షూటింగ్ ఆగిపోతుందని దొంగలు ఆనందపడతారేమోననీ, షూటింగ్ ఆపే ప్రసక్తే లేదని కూడా తెలిపారు. జేమ్స్ బాండ్‌గా డానియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ కొత్త బాండ్ తెరపైకి రానున్నాడు.