ట్వీటే చేటాయెనె?

22 Jul, 2018 04:02 IST|Sakshi
జేమ్స్‌ గన్‌

ట్వీటర్‌ని మన అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అలా అభిప్రాయాలు పంచుకోవడమే హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ గన్‌ కొంప ముంచింది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయన వేసిన కొన్ని జోక్స్‌ వల్ల హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ సిరీస్‌ ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గ్యాలక్సీ’ సినిమాకి డైరెక్టర్‌గా ఆయన సీట్‌కే ఎసరొచ్చింది. విషయంలోకి వెళ్తే.. దాదాపు పదేళ్ల క్రితం ‘రేప్, చైల్డ్‌ అబ్యూస్‌ (చిన్నపిల్లలపై లెంగిక వేధింపులు) వంటి అంశాల గురించి కొన్ని ట్వీట్స్‌  పోస్ట్‌ చేశారు దర్శకుడు జేమ్స్‌ గన్‌.

ఆయన ట్వీట్లు పలువురి మనోభావాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ జేమ్స్‌ గన్‌ను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ వాల్ట్‌ డిస్నీ చైర్మన్‌ అలన్‌ హార్న్‌ పేర్కొన్నారు. ఆయన చేసిన పాత ట్వీట్స్‌ గురించి  జేమ్స్‌ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌ స్టార్టింగ్‌లో చేసిన ట్వీట్‌లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దానికి క్షమాపణలు కోరుతున్నాను. అప్పటికీ ఇప్పటికీ కంప్లీట్‌గా డిఫరెంట్‌ పర్శన్‌ని అయ్యాను’’ అన్నారు. మరి.. జేమ్స్‌ ఇచ్చిన ఈ వివరణకు అలన్‌ హార్న్‌ కూల్‌ అవుతారా? ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గ్యాలక్సీ 3’ బాధ్యతలను తిరిగి ఇచ్చేస్తారా? ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? కాలమే చెప్పాలి.

మరిన్ని వార్తలు