గానకోకిలకు...జీవిత సాఫల్య పురస్కారం!

14 Jul, 2015 00:51 IST|Sakshi
గానకోకిలకు...జీవిత సాఫల్య పురస్కారం!

దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలు ఆలపించి, శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గాయని ఎస్. జానకి. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో ఆమె అందుకోని అవార్డులు లేవు. తాజాగా, జానకిని మరో పురస్కారం వరించింది. ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’లో భాగంగా 2014వ సంవత్సరానికి గాను ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు జ్యూరీ చైర్మన్, నిర్మాత డి. సురేశ్‌బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు.

ఈ నెల 22న హైదరాబాద్‌లో జరిగే భారీ వేడుకలో ఈ అవార్డులు అందజేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోనూ ప్రతి భాషలో 14 విభాగాల్లో ఉత్తమ సినీ సంగీత కళాకారులకు అవార్డులిస్తారు. ‘‘దక్షిణాదిలో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఆరో ఏట అడుగుపెట్టింది. తెలుగు వరకు 2014లో విడుదలైన 197 సినిమాల్లో పాటలున్న 176 చిత్రాల్లోని 947 గీతాలను పరిశీలించాం’’ అని నట, రచయిత తనికెళ్ల భరణి చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులైన దర్శకుడు చంద్రసిద్ధార్థ్, సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, కల్యాణీమాలిక్, రచయిత అబ్బూరి రవి, గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, గాయని సునీత, ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా