‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం

24 May, 2020 06:49 IST|Sakshi

రొమాంటిక్‌ డ్రామా ‘ధడ్కన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ ‘గ్లామర్‌ డాల్‌’ పాత్రలకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు... అందుకే ‘గుంజనా సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’తో సినీ పండితుల ప్రశంసలు అందుకుంది. ‘ఘోస్ట్‌స్టోరీస్‌’లో ‘నర్స్‌’ పాత్రతో మెప్పించింది. కవిత్వం కూడా రాసే ఈ అమ్మాయి కబుర్లు...

అయినా సరే...
సినిమా కుటుంబంలో పుట్టి పెరిగినా, సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాగని సినిమాలు అంటే ఆసక్తి లేదని కాదు. కాలేజీకి బంక్‌ కొట్టి రోజుకు అయిదు సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. అమ్మతో పాటు షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త ప్రదేశాలు చూడాలనే  ఆసక్తి మాత్రం ఉండేది. యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ అయితే తీసుకున్నానుగానీ, అక్కడ నేర్చుకున్నవాటిలో కొన్ని పాఠాలకు నేను సరిపోనేమో అనిపించింది.

నా ఇష్టం
‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం. ప్రేక్షకుల మాటేమిటోగానీ నన్ను నేను ఎప్పుడూ సెలబ్రిటీ అనుకోను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నా గురించి నేను మాట్లాడడం ఎక్కువైంది. అడిగిన వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం, సెల్ఫీలు దిగడం కూడా కొత్తగానే ఉంది. వీటి కంటే నాకు బాగా ఇష్టమైనది... ఇంటికెళ్లి హాయిగా ఐస్‌క్రీమ్‌లు లాగించడం. పార్టీలకు వెళ్లడం బొత్తిగా ఇష్టం ఉండదు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. కవిత్వం రాయడం అంటే ఇష్టం. రాత్రివేళల్లో పాత హిందీ సినిమాలు చూడడం అంటే ఇష్టం.

నా అదృష్టం
కెరీర్‌ కోసం పరుగులు తీయాలని లేదు. చా...లా నెమ్మదిగా, ఆచితూచి నాకు ఇష్టమైన పాత్రలు చేయాలని ఉంది. ‘గుంజన్‌ సక్సేనా’ సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం. విభిన్నమైన సినిమాలలో నటించడం ద్వారా నన్ను నేను నిరూపించుకోవాలను కుంటున్నాను. కుటుంబ నేపథ్యంతో సంబంధం లేని, ఏమాత్రం పరిచయంలేని పాత్రలను పోషించడం నిజంగా సవాలు. దీని మూలంగా మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయమవుతుంది. ‘ధడ్కన్‌’ సినిమా నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చింది. ‘గ్లామర్‌గా కనిపించాలి’ అంటూ ప్రయాసపడిపోను. జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. నాకు నచ్చిందే చేస్తాను.

భూమి మీదికి...
ఫిల్మ్స్‌ ప్రమోషన్‌ల సమయంలో ప్రతి ఒక్కరూ ‘నీ కంటే ముఖ్యమైన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు!’ అన్నట్లు చూస్తారు. ‘మీరు ఏం తింటారు?’, ‘ఎన్ని గంటలకు నిద్రిస్తారు?’, ‘మీ ఆలోచనలు ఏమిటి?’... ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతారు... ఇదంతా చూసి మనకేదో ప్రత్యేకత ఆపాదించుకోవడం అర్థం లేని వ్యవహారం. అసలు మనమేమిటో మన పనే చెబుతుంది. తెలిసో తెలియకో అప్పుడప్పుడూ భూమికి చాలా దూరంగా కాల్పనిక ప్రపంచంలో విహరిస్తుంటాను. అలాంటి సమయంలో ఎవరైనా నన్ను తిరిగి భూమి మీదికి తీసుకువస్తే బాగుణ్ణు అనిపిస్తుంది!

మరిన్ని వార్తలు