నువ్వు మతోన్మాదివి; మండిపడ్డ రచయిత

23 Mar, 2018 12:00 IST|Sakshi
జావేద్‌ అక్తర్‌

న్యూఢిల్లీ : ఫ్రెంచ్‌ కాలమిస్ట్‌ ఫ్రాంకోయిస్‌ గుటర్‌పై బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ ట్విటర్‌ వేదికగా తిట్ల వర్షం కురిపించారు. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో భారతీయ ఇతిహాస గాథ మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారని, ఆ సినిమాను ముఖేశ్‌ అంబానీ నిర్మించనున్నారని ఊహాగానాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అతి ముఖ్యమైన కర్ణుడు లేదా కృష్ణుని పాత్ర పోషించాలని ఉందని బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ఎన్నోసార్లు తన మనసులో మాట బయటపెట్టారు. దీనిపై ఫ్రాంకోయిస్‌ స్పందిస్తూ... ‘హిందువులకు చెందిన ఇతిహాస గాథ మహాభారతంలోని  పాత్రను ఒక ముస్లిం ఎలా చేయగలడు. లౌకికవాదం పేరిట మోదీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌లాగే ప్రవర్తిస్తుందేమో? ఒకవేళ మహ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్రలో ఆయన పాత్ర ఒక హిందువు పోషించడానికి ముస్లింలు అంగీకరిస్తారా ’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు స్పందనగా.. జావేద్‌ అక్తర్‌.. పరుష పదజాలంతో ఫ్రాంకోయిస్‌పై విరుచుకుపడ్డాడు. ‘యూ స్కౌండ్రల్‌ మా దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నావేమో. అసలు నీ వెనుక ఏ దేశ హస్తం ఉందో చెప్పు’ అంటూ జావేద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాకుండా.. ‘భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి నీకేం తెలుసు, మతోన్మాదం అనే బావిలోని కప్పవు నువ్వు’ అంటూ ట్వీట్‌ చేశారు.
గతంలో కూడా గుర్‌మెహర్‌ కౌర్‌ వివాద సమయంలో, వీరేంద్ర సెహ్వాగ్‌, ఫొగట్‌ సిస్టర్స్‌ విషయంలోనూ జావేద్‌ కాస్త కఠినంగానే స్పందించారు.

మరిన్ని వార్తలు