ఆడితే నా చుట్టూ పదిమంది... లేదంటే పదిమంది చుట్టూ నేను!

26 Nov, 2017 00:46 IST|Sakshi

‘‘ఇప్పటివరకూ 70 సినిమాలకు పైగా రచయితగా పనిచేశా. ‘వాంటెడ్‌’తో దర్శకుడిగా మారా. ఆ సినిమాను అనుకున్నట్టుగా తీయలేకపోయా. ‘జవాన్‌’ విషయంలో నా తప్పుల్ని రిపీట్‌ కానివ్వలేదు. ఈసారి నాలోని రచయిత కన్నా దర్శకుడే ఎక్కువ డామినేట్‌ చేశాడు. సినిమా తప్పకుండా హిట్టవుతుందని చెప్పగలను’’ అని బీవీయస్‌ రవి అన్నారు. సాయిధరమ్‌ తేజ్, మెహరీన్‌ జంటగా ఆయన దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన సిన్మా ‘జవాన్‌’. ‘దిల్‌’ రాజు సమర్పకులు. వచ్చే నెల 1న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి బీవీయస్‌ రవి మాట్లాడుతూ– ‘‘ప్రతి వ్యక్తికీ ఓ లక్ష్యం ఉంటుంది.

అందరి ఉమ్మడి లక్ష్యం దేశం కావాలి. దేశం కోసం నీది, నాది అనే భావలను పక్కన పెట్టి అందరం ఒక్కటై మనం అనే భావనతో ముందుకు సాగాలి’ అనే థీమ్‌తో, సందేశంతో సినిమా తీశా. కథంతా డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) నేపథ్యంలో జరుగుతుంది. పోస్టర్లు, ట్రైలర్లలో కథేంటో చెప్పేశా. కథ రాశాక (సాయిధరమ్‌) తేజ్‌నే హీరోగా అనుకున్నా. సినిమాలో తేజ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ జవాన్‌గా కనిపిస్తాడు. ‘కష్టం తనదాకా వస్తే కదిలేవాడు మనిషి కాడు, కష్టం ఎక్కడుందో తెలుసుకుని వెళ్లేవాడు మనిషి’– అనేది తేజ్‌ క్యారెక్టరైజేషన్‌.

తను చేసిన గత సినిమాల్లో పాత్రలకంటే విభిన్నమైన పాత్ర. యాక్టింగ్‌ పరంగా, లుక్స్‌ పరంగా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తేజ్‌ కెరీర్‌లో ‘జవాన్‌’ ఓ కీలక మలుపుగా నిలుస్తుందనే నమ్మకముంది. ఈ సినిమా నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్‌. ఇది ఆడితే పదిమంది నాకు డబ్బులిచ్చి సినిమాలు తీయమంటారు. లేదంటే పది మంది చుట్టూ నేను తిరుగుతా. ఒక్కటి మాత్రం చెప్పగలను... భవిష్యత్తులోనూ విలువలతో కూడిన సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు