జయహో... జయ జానకి నాయక

12 Aug, 2017 00:39 IST|Sakshi
జయహో... జయ జానకి నాయక

ప్రేమంటే ఏంటి?
రెండు ముద్దులు, మూడు హగ్గులు ఇవ్వడమా...

ప్రేమికుడంటే ఎవడు?
అమ్మాయితో ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరిగేవాడా....  కానే కాదు!!!

మరేంటి?
అందరి ఆనందం కోసం అనుక్షణం ఆలోచించడమే... ప్రేమ. కష్టాల్లోనూ అమ్మాయి తోడుగా సైనికుడల్లే పోరాడేవాడే... ప్రేమికుడు.

తండ్రంటే ఎవరు?
పరువు కోసం కన్నబిడ్డను కసాయిలా చంపేవాడా....

పరువు, పరపతి అంటే ఏంటి?
కన్నబిడ్డ ప్రేమను కాదని డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారడమా... కానే కాదు!!!

మరేంటి?
కన్నబిడ్డ కోరుకున్నది ఇచ్చేవాడు... కష్టాల్లో పిల్లల కన్నీళ్లు తుడిచేవాడు... తండ్రి.ప్రేమలో పలుకుబడి కాకుండా కన్నబిడ్డ సంతోషాన్ని, నిజాయితీనీ చూడడమే... పరువు, పరపతి.

సంపాదించడమంటే ఏంటి?
లంకంత కొంపలో ఉంటూ, స్టార్‌ హోటళ్లలో భోంచేస్తూ, సూటు–బూటు వేసుకుని తిరగడమా....కానే కాదు!!!

మరేంటి?
కొంపలో మన కోసం కష్టపడేవాళ్లను కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం... పిజ్జాలు–బర్గర్లు పక్కనపెట్టి, పొట్టకూటికై రెక్కల కష్టం చేసే ప్రజలకు కాస్త సాయం చేయడం... సూటు–బూటుల్లోనూ మన సంప్రదాయాలకు విలువ ఇవ్వడమే... అసలైన సంపాదన.
  
ఈ శుక్రవారం (నిన్న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జయ జానకి నాయక’లో దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిందిదే. అడుగడుగునా విలువలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటే ఎవరు చూస్తారండి? అనొచ్చు. బోయపాటి శ్రీనుకూ ఈ సందేహం వచ్చుండొచ్చు. అందుకేనేమో... మందుబిళ్ల చుట్టూ పంచదార పొడి అద్దినట్టు... మంచి కథ చుట్టూ మళ్లీ మళ్లీ చూడాలనిపించే కమర్షియల్‌ హంగులు అద్దారు. మాసీ కమర్షియల్‌ మెసేజ్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు.

ఇందులో ఆనందంలోనే కాదు, కష్టాల్లోనూ ప్రేమించిన అమ్మాయి తోడు నిలిచిన కథానాయకుడిగా, అందుకోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించారు. అతని ప్రేయసిగా, అందరూ ఆనందంగా ఉండాలనుకునే అమ్మాయిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించారు. పరువు కోసం కన్నబిడ్డను చంపే తండ్రిగా జగపతిబాబు, కన్నబిడ్డ కన్నీళ్లు తుడిచే తండ్రిగా శరత్‌కుమార్‌ నటించారు. మిగతా కీలక పాత్రల్లో తరుణ్‌ అరోరా, నందు, ప్రగ్యా జైశ్వాల్, ధన్యా బాలకృష్ణ, స్పెషల్‌ సాంగులో కేథరిన్‌ త్రేసా నటించారు. సందేశాలు–కమర్షియల్‌ హంగులు పక్కనపెట్టి ఈ సినిమా కథలోకి వెళితే....

చక్రవర్తి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ చక్రవర్తి (శరత్‌కుమార్‌) రెండో కుమారుడు గగన్‌ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌). కాలేజీలో కుర్రాడి మంచితనం, అమ్మాయిలను ఏడిపించిన పోకిరీల ఆటకట్టించిన గడుసుతనం చూసి స్వీటీ అలియాస్‌ జానకి (రకుల్‌ప్రీత్‌ సింగ్‌) ప్రేమలో పడుతుంది. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే స్వీటీ తీయనైన మనసు చక్రవర్తికి, అతని ఫ్యామిలీకి నచ్చుతుంది. కానీ, ఈ ప్రేమ సంగతి స్వీటీ తండ్రి, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారి (జయప్రకాశ్‌)కి నచ్చదు.

ఎందుకంటే... ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియాలో పేరు మోసిన హైవేస్‌ కాంట్రాక్టర్‌ అశ్వత్థ నారాయణవర్మ (జగపతిబాబు) స్వీటీ తండ్రితో సంబంధం కలుపుకోవాలనుకుంటాడు. పెద్ద సంబంధం రావడంతో గగన్‌ ఫ్యామిలీని స్వీటీ తండ్రి చులకన చేసి మాట్లాడతాడు. ఆయన మాటలు గగన్‌ గుండెకు గాయాన్ని చేస్తాయి. కష్టంగా ఉన్నా కన్నతండ్రిపై స్వీటీకున్న గౌరవాన్ని గౌరవిస్తూ ఆమెకు దూరమవుతాడు గగన్‌. విశాఖలో తెలిసినోళ్ల (ప్రగ్యా జైశ్వాల్‌) ఇంటికి వెళతాడతను.

అక్కడ అశ్వథ్‌ను ఎవరో చంపబోతుంటే గగన్‌ కాపాడతాడు. అప్పుడొక ఊహించని మలుపుతో ఇంటర్వెల్‌ పడుతుంది. ఆసక్తికరమైన ట్విస్టులతో సెకండాఫ్‌ సాగుతుంది. గగన్‌–అశ్వథ్‌ నారాయణవర్మ–లిక్కర్‌ కింగ్‌ అరుణ్‌ పవార్‌ (తరుణ్‌ అరోరా)ల మధ్య యుద్ధం మొదలవుతుంది. అసలీ అరుణ్‌ పవార్‌ ఎవరు? స్వీటీ సంతోషం కోసం గగన్‌ ఏం చేశాడు? పరువే ప్రాణంగా బతికే అశ్వథ్‌ నారాయణవర్మ ఏం చేశాడు? అశ్వథ్‌ నారాయణవర్మ ఒక్కడే శత్రువు అనుకుంటే... స్వీటీకి అండగా, తనకు అడ్డుగోడగా వచ్చిన గగన్‌ను అరుణ్‌ పవార్‌ ఏం చేశాడు? అనేది మిగతా చిత్రకథ.

స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ బోయపాటి మార్క్‌ మాస్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమా సాగుతుంది. దీన్ని క్లాస్‌.. మాస్‌ ఎంటర్‌టైనర్‌ అనాలి. బోయపాటి గత సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా పాటలు–ఫైట్లు, మరీ ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్లు చిత్రీకరించారు. చిత్రకథ ప్రారంభమైన కాసేపటికే కథానాయకుడికి అండగా అతని తండ్రి, అన్న ఎంత దూరం వస్తారనే సంగతి చూపించి, ఫైట్స్‌కి కావలసిన ఎమోషన్‌ బిల్డప్‌ చేశారు. ప్రేక్షకుడు నమ్మేలా తీశారు.

ముఖ్యంగా హంసలదీవిలో తీసిన ఫైట్‌ సినిమా మెయిన్‌ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. హీరో వయసు, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫైట్స్‌ డిజైన్‌ చేయించడంలో బోయపాటి మార్క్‌ కనిపిస్తుంది. వంద సినిమాల అనుభవం ఉన్న హీరోను, పదీ ఇరవై సినిమాలు ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న హీరోలను మాత్రమే కాదు.. ఏ హీరోని అయినా తన కథకు తగ్గట్టుగా బోయపాటి మౌల్డ్‌ చేయగలుగుతారని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను చూపించిన విధానం చూస్తే అర్థమవుతుంది.

దర్శకుడి విజన్‌ని అర్థం చేసుకుని భారీ ఎమోషనల్‌ ఫైట్స్‌కి అనుగుణంగా తన మజిల్స్, బాడీని బిల్డ్‌ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. అలాగే, పాత్రకు అనుగుణంగా సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశారు. జగపతిబాబు, శరత్‌కుమార్, తరుణ్‌ అరోరా, వాణీ విశ్వనాథ్, చలపతిరావు తదితరులు చక్కని నటన కనబరిచారు. ఫస్టాఫ్‌లో అందంగా కనిపించిన రకుల్‌ప్రీత్‌ సింగ్, సెకండాఫ్‌లో ఎమోషనల్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. బీచ్‌ సాంగ్‌లో ప్రగ్యా జైశ్వాల్, స్పెషల్‌ సాంగులో కేథరిన్‌ త్రేసాలు అందాలతో కుర్రకారును కనువిందు చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఖర్చుకు ఏ మాత్రం వెనకాడలేదు.

ఆయన పెట్టిన ప్రతి రూపాయినీ సినిమాటోగ్రాఫర్‌ రిషి పంజాబీ స్క్రీన్‌పై చూపించారు. రిచ్‌ లుక్‌తో, లావిష్‌గా షూట్‌ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ పాటల్లో ‘నువ్వేలే నువ్వేలే...’, ‘వీడే వీడే...’, ‘ఏ ఫర్‌ ఆపిలు..’, ‘జయ జానకి నాయక..’ పాటలు బాగున్నాయి. ‘అడవిలాంటి గుండెలోన తులసి కోట నువ్వేలే..’ అంటూ కథానుగుణంగా ‘నువ్వేలే నువ్వేలే...’ పాటలో చంద్రబోస్‌ అర్థవంతమైన సాహిత్యం అందించారు.

హృదయానికి హత్తుకునే ప్రేమకథతో సాగే ఈ క్లాసీ మాసీ ఎంటర్‌టైనర్‌ కుటుంబసమేతంగా చూసేలా ఉంది.శుక్రవారం ఫస్ట్‌ షో రిపోర్ట్‌ ప్రకారం ప్రేక్షకులు జానకీ నాయకుడికి బ్రహ్మరథం పడుతున్నారని టాక్‌ వచ్చింది. ‘‘ముందు చెప్పినట్టు... మంచి సందేశానికి కమర్షియల్‌ హంగులు జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ జానకి నాయకుణ్ణి చూసినోళ్లంతా జయహో.. జయ జయహో.. ‘జయ జానకి నాయక’ అంటున్నారు’’ అని ‘సాక్షి’తో చిత్రబృందం పేర్కొంది.

– సత్య పులగం