అందుకు మంచి ఉదాహరణ జయ జానకి నాయక

23 Aug, 2017 23:57 IST|Sakshi
అందుకు మంచి ఉదాహరణ జయ జానకి నాయక

– బోయపాటి శ్రీను

‘‘తరాలు మారినా మానవ సంబంధాలు మారవు. ఆ పాయింట్‌తో ఎన్ని రకాల సినిమాలు తీసినా హిట్టవుతాయి. అందుకు మంచి ఉదాహరణ ‘జయ జానకి నాయక. రెండో వారంలో కూడా అన్ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలక్షన్స్‌తో దూసుకెళుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ఘనవిజయానికి కారణం కథే. మిర్యాల రవీందర్‌రెడ్డి రాజీపడకుండా నిర్మించారు. ఆయనతో మళ్లీ సినిమా చేయాలనుంది’’ అన్నారు బోయపాటి శ్రీను.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ ఈ నెల 11న విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతి గుండెను తాకే సినిమా అవుతుందనే నమ్మకంతో తీశాం. ప్రేక్షకులు మా సినిమాను వారి గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు. మా నమ్మకం నిజమైంది.

నా జీవితం మారిపోయే సినిమా ఇచ్చిన బోయపాటిగారికి థ్యాంక్స్‌. పోటీ ఉన్నా ఎక్కడా తగ్గకుండా అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేసి, మాకు పెద్ద హిట్‌ ఇచ్చిన రవీందర్‌రెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నేను ఇన్ని సినిమాలు చేసినా, జానకి పాత్రకు వచ్చినంత రెస్పాన్స్‌ ఏ పాత్రకూ రాలేదు. బోయపాటిగారితో మరిన్ని చిత్రాలు చేయాలని ఉంది’’ అన్నారు రకుల్‌. ‘‘మా చిత్రం హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ఇంత గొప్ప సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు రవీందర్‌రెడ్డి. నటులు ప్రభు, శివన్నారాయణ, శ్రావణ్, నటి రూప, కళా దర్శకుడు సాహి సురేశ్, డిస్ట్రిబ్యూటర్‌ హరి తదితరులు పాల్గొన్నారు.