భర్త ఎలా ఉన్నా అంగీకరించాలా?

4 Mar, 2019 03:03 IST|Sakshi
జయప్రద

‘మన సమాజం కొన్ని శతాబ్దాలుగా అమ్మాయిలను మంచి భార్యలుగా తీర్చిదిద్దడానికే కృషి చేసింది. అబ్బాయిలను మంచి భర్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచించలేదు. ఫలితంగా సమాజంలో చెడ్డ భర్తలే చాలామంది ఉన్నారు’’ అన్నారు ప్రముఖ నటి జయప్రద. ‘పర్ఫెక్ట్‌ పతి’ అనే హిందీ సీరియల్‌లో ఆమె నటించారు. ఓ వారం క్రితం ఈ సీరియల్‌ ముగిసింది. ఈ షోలో తన కోడలిని ఇబ్బందిపెడుతున్న కొడుకుని చంపేస్తుంది ఆమె పాత్ర. ‘‘మామూలుగా కొడుకులో తప్పులు ఉన్నా అతన్ని సమర్థించి, కోడలిని హింసించే అత్తలనే మనం సమాజంలో చూస్తుంటాం.

కొడుకుని గుడ్డిగా నమ్మడం తప్పు. అతని తప్పులను ఒప్పుగా అనుకుని కోడలిని వేధించడం ఇంకా తప్పు. ‘పర్ఫెక్ట్‌ పతి’లాంటి మంచి సీరియల్‌ ద్వారా ఉత్తరాది చిన్ని తెరకు అడుగుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లిగా, అత్తగా పాజిటివ్‌ సైడ్‌ని చూపించే క్యారెక్టర్‌ని ఇందులో చేశాను.  సీరియల్‌లో కొడుకు, కోడలి కాపురం హాయిగా సాగడంలేదని తెలుసుకున్న రాజ్యశ్రీ (జయప్రద పాత్ర పేరు) దానికి కారణం తెలుసుకుని, కొడుకుదే తప్పని గ్రహిస్తుంది. కోడలికి న్యాయం చేయడానికి తప్పు చేసిన కొడుకుని చంపేస్తుంది. సమస్యకి కారణమైనవారిని చంపా లని చెప్పడంలేదు.

అయితే ఆ సీరియల్‌లో కొడుకుని అలా చేయడమే కరెక్ట్‌’’ అన్నారు జయప్రద. ఇంకా సమాజం గురించి మాట్లాడుతూ –‘‘మెట్టినింటి నుంచి పుట్టింటికి వెళ్లేటప్పుడు అమ్మాయి ఓ సంస్కారవంతమైన కోడలిగా పేరు తెచ్చుకోవాలనే తపనతో తల్లిదండ్రులు పెంచుతారు. అది తప్పు కాదు. కానీ అబ్బాయిలు మంచి అల్లుడిగా, మంచి భర్తగా ఉండాలనే ఆలోచనతో వాళ్లను పెంచరు. అలాగే భర్త ఎలా ఉన్నా ఆ భార్య అంగీకరించాలనే ఆలోచనతో ఉంటారు. అది సరి కాదు. మంచి భార్యలను ఇస్తున్న మన సమాజం మంచి భర్తలను ఇవ్వడంలో విఫలమవుతోందని నా అభిప్రాయం. అఫ్‌కోర్స్‌ మంచి భర్తలు లేరనడంలేదు. అయితే ఎక్కువగా లేరంటున్నాను’’ అన్నారు జయప్రద.

మరిన్ని వార్తలు