పుత్రోత్సాహంలో జయంరవి

30 Jun, 2018 07:04 IST|Sakshi
కొడుకు ఆరవ్‌రవితో జయంరవి

తమిళసినిమా: మనిషి ఆనందాన్ని వెతుక్కుంటున్న రోజులివి. సినీరంగంలో కూడా సంతోషం గగనంగా మారింది. విజయం వరించడమే కష్టంగా మారింది. అలాంటిది ప్రముఖ యువ నటుడు జయంరవి డబుల్‌ హ్యాపీలో ఖుషీ అయిపోతున్నారు. ఒకటి ఆయన నటించిన టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడడం, మరొకటి పుత్రోత్సాహం. శక్తిసౌందర్‌రాజన్‌ దర్శకత్వంలో నెమిచంద్‌ జపక్‌ నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించింది. డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆయనకు 100వ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రం ద్వారా జయంరవి కొడుకు ఆరవ్‌రవి బాలనటుడిగా పరిచయం అయ్యాడు. చిత్రంలోనూ జయంరవికి కొడుకుగానే నటించాడు. భారతీయ సినీ చరిత్రలోనే తొలి అంతరిక్ష ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రంగా నమోదైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను శుక్రవారం చిత్ర యూనిట్‌ చెన్నైలో నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జయంరవి మాట్లాడుతూ టిక్‌ టిక్‌ టిక్‌ చిత్ర విజయానికి ముఖ్య కారణం ప్రేక్షకులేనన్నారు. అందుకే వారికి హ్యాట్సాప్‌ చెబుతున్నానన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాధారణ విషయం కాదని అలాంటిది సమర్థవంతంగా తెరకెక్కించిన దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్‌ ఈ విజయానికి కారణంగా పేర్కొన్నారు. యూనిట్‌ సభ్యులందరూ పూర్తి ఎఫర్ట్‌ పెట్టి చేసిన చిత్రం టిక్‌ టిక్‌ టిక్‌ అని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. కారణం ఇందులో తన కొడుకు ఆరవ్‌ రవి తొలిసారిగా నటించాడని అన్నారు. చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ప్రేమను ఆవిష్కరించే కురుంబా అనే పాటను తాను ఇప్పుటికి రెండు వేల సార్లు విన్నానని తెలిపారు. శుక్రవారం ఆరవ్‌రవి పుట్టిన రోజు అని, ఈ ఆనందంతో పాటు, టిక్‌ టిక్‌ టిక్‌ సక్సెస్‌ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని జయంరవి పేర్కొన్నారు. కార్యక్రమంలో జయం రవి తండ్రి ఎడిటర్‌ మోహన్, సోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా, చిత్ర దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, డీ.ఇమాన్‌ చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. ముందుగా ఆరవ్‌రవి పుట్టిన రోజును పురష్కరించుకుని ఆ బాలనటుడితో కేక్‌ కట్‌ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు