జీరో నుంచి మొదలయ్యా

13 Mar, 2019 01:11 IST|Sakshi

‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి, పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అవుతున్న టైమ్‌. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్‌ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత ‘ఆర్య’ స్క్రిప్ట్‌ చూసినప్పుడు ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేశారు? అనేది చూశాను. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన చిత్రం ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితారామ్‌ హీరోయిన్‌. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ఆర్‌. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్‌ విడుదల చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘పెద్ద మనుషులు ఉంటేనే ఇండస్ట్రీ మరింత పెద్దది  అవుతుంది. ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకులు, రచయితలు మా ఫంక్షన్‌కి వచ్చి, నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్‌స్పైర్‌ అవుతున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు.

నా సీక్రెట్‌ ఒక్కటే... నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్‌ అవుతుంది. ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్‌ పార్టీ స్టార్ట్‌ చేశా. రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 80 శాతం మంది ఇన్నోసెంట్‌ పీపుల్‌ని  20 శాతం మంది రూల్‌ చేస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను’’ అన్నారు. ‘‘నన్నే.. ప్రేమించు’ లాంటి ట్యాగ్‌ ఉపేంద్రగారికి మాత్రమే సరిపోతుంది. ‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ వంటి కల్ట్‌ మూవీస్‌ జాబితాలోకి ఈ సినిమా చేరుతుంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్‌. ‘‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలకి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలిగేది. ఉపేంద్ర, పూరి జగన్నాథ్‌గార్ల ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది’’ అని దర్శక–నిర్మాత వైవీయస్‌ చౌదరి అన్నారు. ‘‘నన్ను తెలుగుకు పరిచయం చేసిన లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. ఇండియాలో టాప్‌ టెన్‌ దర్శకుల్లో ఉపేంద్రసార్‌ ఉంటారు అని డైరెక్టర్‌ శంకర్‌గారు ఓ సందర్భంలో చెప్పారు. అటువంటి గొప్ప దర్శకుణ్ణి రెండోసారి దర్శకత్వం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కథ విన్న ఉపేంద్రగారు ‘ఇది ఒక ‘గీతాంజలి’ అవుతుంది’ అన్నారు’’ అన్నారు ఆర్‌. చంద్రు. హీరో సుధాకర్‌ కోమాకుల, నటి సంజన, హైకోర్టు లాయర్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర, కెమెరా: సుజ్ఞాన్, లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య, సంగీతం: డా. కిరణ్‌. 

మరిన్ని వార్తలు