విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

18 Sep, 2019 11:02 IST|Sakshi
జయసుధకు కంకణం తొడుగుతున్న సినీనటి జయప్రద 

సత్కార సభలో సినీ నటి జయసుధ

 అభినయ మయూరి బిరుదు ప్రదానం

వైభవంగా టీఎస్‌ఆర్‌ జన్మదిన వేడుకలు

సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత తన మొదటి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వైజాగ్‌లోనే ఏర్పాటయిందని నటి జయసుధ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బరామిరెడ్డి లలిత కళాపీఠం ఆధ్వర్యంలో నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును పోర్టు ఆడిటోరియంలో మంగళవారం అందజేశారు. బిరుదు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారన్నారు. అలాంటి విశాఖలో  గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీఎస్సార్‌ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారన్నారు.  అంతేకాకుండా విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరని చెప్పారు.

ఇంత మంది ప్రముఖుల మధ్య తనకు అభినయ మయూరి బిరుదు ప్రదానం చేయడం చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. ముందుగా  టీఎస్సార్‌ ఓంకారం నాదంతో కార్యక్రమం ప్రారంభించారు. నటి ఉర్వశి శారద మాట్లాడుతూ టీఎస్సార్‌ చాలా మందికి సహాయం చేస్తారని కాని ఆవిషయం ఎప్పుడు చెప్పుకోని గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మాట్లాడుతూ అన్ని రంగాల్లో విజయం సాధించిన వ్యక్తి టీఎస్సార్‌ అన్నారు. వైజాగ్‌ అంటే మొదట బీచ్‌ ఆ తరువాత టీఎస్సార్‌ గుర్తుకు వస్తారన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో టీఎస్సార్‌ ఒకరు అన్నారు. గత 14 ఏళ్లుగా ఆయన జన్మదిన వేడుకలకు విశాఖకు రావడం జరుగుతోందన్నారు. మాజీ ఎంపీ మురళీ మోహన్‌ మాట్లాడుతూ మరో శ్రీకృష్ణదేవారాయులు టీఎస్సార్‌ అన్నారు.

నిరంతరం కళాకారులను ప్రోత్సహించడంలో టీఎస్సార్‌ తరువాతే ఎవరైనా అన్నారు. జయసుధ నటన చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. అందుకే ఆమె సహజనటి అయిందని కొనియాడారు. రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ టీఎస్సార్‌ జన్మదిన వేడుకలు తెలుగు పండుగతో సమానమన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన జన్మదినం కోసం విశాఖకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, నటి జీవిత, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితులు పాల్గొన్నారు.

జయసుధ ఎందరికో ఆదర్శం
మన జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు.అందులో కొంత మంది మాత్రమే బంధువులు అవుతారని నటి రాధిక అన్నారు. అలాంటి స్నేహితురాలే జయసుధ అన్నారు. జయసుధకు ఈ రోజు ఈ బిరుదు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జయసుధ తనకు ఫోన్‌ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచిందన్నారు. సహజనటి జయసుధను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.

మా నిధుల సేకరణ టీఎస్సార్‌ నిర్వహించాలి : రాజశేఖర్‌
రాజకీయ, సినీ ప్రముఖులను అందర్నీ ఒకే చోట తీసుకురావడంతో టీఎస్సార్‌ను మించిన వారు ఎవరూ లేరని నటుడు రాజశేఖర్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కోసం చేపట్టబోయే నిధుల సేకరణ కార్యక్రమాలను కూడా టీఎస్సార్‌ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

సినీ పరిశ్రమకు వైజాగ్‌ వరం
వైజాగ్‌ ప్రజలను ప్రతి సంవత్సరం కలిసేందుకే టీఎస్సార్‌ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అని అనిపిస్తుందని నటి జయప్రద అన్నారు. సినీ పరిశ్రమకు వైజాగ్‌ ఓ వరమన్నారు. జయసుధతో కలిసి అనేక సినిమాల్లో నటించానని, ఆమె అద్భుత నటి అని కొనియాడారు.

నవ్వులు పూయించిన శరత్‌ కుమార్‌
నటుడు శరత్‌ కుమార్‌ తన మాటలతో నవ్వులు పూయించారు. టీఎస్సార్‌ ఈ వయస్సులో కూడా తన వాయిస్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నారన్నారు. 46 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జయసుధ రాణించడం అభినందనీయమన్నారు. సెప్టెంబర్‌ 17న సినీ పరిశ్రమలో ప్రముఖులు అంత ఎక్కడ ఉంటారు అంటే విశాఖలోనే అని గత కొన్నేళ్లుగా రుజువు అవుతుందన్నారు.

మరిన్ని వార్తలు