దెయ్యం అంటే చాలా భయమంటా..

26 Apr, 2017 20:25 IST|Sakshi
దెయ్యం అంటే చాలా భయమంటా..
కోలీవుడ్‌లో కొంత కాలంగా హారర్‌ కథల ట్రెండ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళంలో విడుదల అవుతున్న ఎలాంటి హారర్‌ చిత్రం అయినా సరే విజయం సాధిస్తుండడం విశేషం. ఈ వరుసలో తాజాగా మరో హారర్‌ చిత్రం తెరపైకి రానుంది. బాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, అట్లి ఏ ఫార్‌ ఆపిల్‌ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘సంగిలి బుంగిలి కదవ తొర‘. జీవా, శ్రీదివ్య, సూరి నటిస్తుండగా, కమల్‌హాసన్‌ సహాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి  ఐక్‌ కొత్త దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

విశాల్‌ చంద్రశేఖరన్‌ సంగీతంలో శింబు, అనిరుద్‌, జీవీ ప్రకాష్, గంగై అమరన్, ప్రేమ్‌జీ వంటి ఐదుగురు సంగీత దర్శకులు పాటలు పాడారు. ఈ చిత్ర ఆడియో ఇటీవల సత్యం థియేటర్‌లో విడుదల చేశారు. విభిన్న హారర్, కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్ర ఆడియోను కమల్‌హాసన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అట్లీ మాట్లాడుతూ.. ఇదే సత్యం థియేటర్‌లో తన తొలి చిత్రం ‘రాజారాణి’ ఆడియో విడుదల జరిగిందన్నారు. రూపాన్ని చూసి ‘ఎవరినీ వీడేమి చేస్తాడులే..’ అని ఊహించరాదన్నారు.

ఆ విధంగా తలచకుండా ఆర్‌.మురుగదాస్‌ సార్‌ అవకాశం ఇచ్చినందువల్లే ఇప్పుడు దర్శకుడిగా ఇక్కడ నిలుచోని  ఉన్నట్టు తెలిపారు. చాలా కథలు విని, వాటిలో నుంచే ఈ ‘సంగిలి బుంగిలి కదవ తొర’ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. తనకు దెయ్యం అంటే చాలా భయమని, అందువల్లనే ఇటువంటి దెయ్యం చిత్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు చిత్ర నిర్మాత, దర్శకుడు అట్లి అన్నారు.