ఈవిడగారు పడకపోతే న్యూస్!

17 Nov, 2015 01:11 IST|Sakshi
ఈవిడగారు పడకపోతే న్యూస్!

కాకతాళీయంగా జరుగుతుందో, నలుగురూ తన గురించి చర్చించుకోవాలని చేస్తారో కానీ... ఏ ఫంక్షన్లో పాల్గొన్నా అక్కడ అమాంతం కిందపడిపోతుంటారు జెన్నీఫర్ లారెన్స్. ఈ పాతికేళ్ల హాలీవుడ్ అందానికి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ఈవిడగారు కిందపడ్డప్పుడల్లా అభిమానులు తెగ ఫీలైపోతుంటారు. 2013లో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళుతూ జర్రున జారారు జెన్నీఫర్. 2014లోనూ అలానే జరిగింది.

కారులోంచి దిగి, రెడ్ కార్పెట్ మీద ఒయ్యారంగా నడుస్తూ అమాంతంగా పడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ షోస్‌లో కూడా జెన్నీఫర్ కాలు జారిపడ్డ దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజా విషయం ఏమిటంటే... జెన్నీఫర్ నటించిన ‘ది హంగర్ గేమ్స్: మాకింగ్‌జే -పార్ట్ 2’ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా జెన్నీఫర్ ఎర్ర తివాచీపై నడిచారు. నలుపు రంగు పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు ధరించి జెన్నీఫర్ మెట్లు ఎక్కారు. అంతే.. అడుగు తడబడింది. కిందపడిపోయారు. పడడం ఎలాగూ అలవాటే కనుక వెంటనే లేచి, ఏమీ జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయారు జెన్నీఫర్. ఎప్పుడూ పడిపోతుంటారు కాబట్టి, జెన్నీఫర్ పడకపోతే న్యూస్ అని హాలీవుడ్‌లో జోక్‌లు వేసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి