దీన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటా!

11 Sep, 2016 08:38 IST|Sakshi
దీన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటా!

 - థ్యాంక్స్ మీట్‌లో ఎన్టీఆర్
‘‘ఓ వెలుగు కనిపిస్తుందని ఎప్పుడో చెప్పా. ఈరోజు నిజంగా.. నేను నమ్మిన వెలుగుని నాకు అందించిన ప్రేక్షక దేవుళ్లకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అన్ని విజయాల కంటే ఈ విజయాన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటాను. ఎప్పటికీ మరువను. ఇంకా బాధ్యతతో సినిమాలు చేస్తా’’ అన్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా ‘జనతా గ్యారేజ్’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘కొన్నిసార్లు కళ్లలో ఆనందంతో వచ్చే నీళ్లు తప్ప.. మాటలు రావు. అంత గొప్ప అనుభూతిని దర్శకుడు కొరటాల శివ నాకు అందించాడు.
 
 ఈ నెల 2న మా అమ్మానాన్నల పుట్టినరోజు. ఇద్దరికీ 60 ఏళ్లు నిండాయి. పన్నెండేళ్ల నా తపన, సంకల్పాన్ని ‘జనతా గ్యారేజ్’ రూపంలో వాళ్లకు గిఫ్ట్‌గా అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటా. ఆయన పక్కన నటించే అర్హత, వయసు లేకపోయినా నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా, ఓ శిష్యుడిలా భావించి జీవితంలో ఎన్నో కొత్త కోణాలు తెలుసు కునేలా చేసిన ద కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ నిర్మాతలు ఇంకా ఎన్నో విజయాలు చూడాలని కోరుకుంటున్నాను. నా సక్సెస్, మేకోవర్ వెనక నా స్టైలిష్ అశ్విన్ కృషి ఎంతో ఉంది. దేవిశ్రీ తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు.
 
‘బృందావనం’ తర్వాత నేను, సమంత చేసిన రెండు చిత్రాలూ మేము అనుకున్న విజయం సాధించలేదు. నేను సెంటిమెంట్స్ నమ్మను కానీ, చాలామంది ‘ఎన్టీఆర్, సమంత కలసి నటిస్తే సినిమా హిట్ కాదు’ అని మాట్లాడారు. ఫైనల్లీ.. ‘జనతా గ్యారేజ్’తో హిట్ అందుకున్నాం. సినిమాలోనే కాదు, షూటింగ్‌లోనూ మా వెన్నంటి పాజిటివిటీ అందించిన మెకానిక్స్, మా చంటి మామ (ఎడిటర్ కొటగిరి వెంకటేశ్వరరావు), పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డెరైక్టర్ ప్రకాశ్, అందరికీ థ్యాంక్స్.  నా స్నేహితుడు రాజీవ్ కనకాల చేశాడు కాబట్టే వికాస్ క్యారెక్టర్, జి.హెచ్.ఎం.సి. ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారు. మాకంటే గట్టిగా డిస్ట్రిబ్యూటర్లు సినిమాని నమ్మారు. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.
 
 దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మొదటి వారంలోనే డబ్బులొచ్చేశాయని డిస్ట్రిబ్యూ టర్లు చెప్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ - ‘‘తారక్ కాంబి నేషన్‌లో నాకు బ్లాక్‌బస్టర్ ఇస్తానని శివగారు మాటిచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్తుంటే నాకే డబ్బులొచ్చినంత హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రానికి 8 రోజుల్లోనే నేను పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ ‘జనతా గ్యారేజ్’కి వచ్చాయి’’ అన్నారు. రాజీవ్ కనకాల, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ, ఎడిటర్ కోటగిరి, ఆర్ట్ డెరైక్టర్ ఏఎస్ ప్రకాశ్ పాల్గొన్నారు.
 
  ఆయన నమ్మకమే కారణం
 - దర్శకుడు కొరటాల శివ

‘‘యంగ్ టైగర్ కాదు, ఎన్టీఆర్ యంగ్ బ్రదర్ నాకు. రెండేళ్ల క్రితం కథ విన్నప్పుడే ‘చాలా మంచి కథ. పెద్ద స్థాయికి వెళ్తుంది’ అన్నారు. అందరి కన్నా ఈ కథను ఎక్కువ నమ్మింది ఎన్టీఆరే. ఈ భారీ విజయానికి కారణం మొదట ఆయన నమ్మకమే. తర్వాత ఈ స్థాయి విజయానికి మరో కారణం మోహన్‌లాల్‌గారు.’’