ఇంకా పూర్తి కాలేదు!

4 Mar, 2018 00:47 IST|Sakshi
ఎన్టీఆర్‌ , వర్కవుట్స్‌ చేస్తున్న ఎన్టీఆర్‌

ఏమున్నావ్‌ బాసూ! లుక్‌ అదిరిందంతే! కిర్రాక్‌ ఉన్నావ్‌!... ఇదిగో ఇలాగే ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ను చూసిన అభిమానులు అనుకుంటున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆన్‌ సైలెంట్‌ మోడ్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని టాక్‌. హారికా హాసినీ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమాలో న్యూ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌ ఎలా ఉంటారో చూడాలని ఫ్యాన్స్‌ వెయిటింగ్‌. అందుకే ఎన్టీఆర్‌ లేటెస్ట్‌ లుక్‌లో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఆనందపడుతున్నారు. ఈ ఫొటోస్‌లో ఎన్టీఆర్‌ మునుపటి కన్నా స్లిమ్‌ అండ్‌ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

అంతేకాదు ఎన్టీఆర్‌కు ట్రైనింగ్‌ ఇస్తున్న లాయిడ్స్‌ స్టీవెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో ‘ఇంకా పూర్తి కాలేదు’ అనే కామెంట్‌ ఉండి, ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంటే.. మొత్తం వర్కవుట్స్‌ పూర్తయ్యేసరికి ఎన్టీఆర్‌ ఇంకా స్లిమ్‌ అయిపోతారన్న మాట. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ నెల 23న స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందనుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అల్లు అర్జున్‌ నటించనున్నారని, ఆల్రెడీ రామ్‌చరణ్‌ సరసన సమంత, ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ యాక్ట్‌ చేయబోతున్నారనే వార్త వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు