క్రికెటర్‌ పాత్ర పోషించాలంటే  భయమేస్తోంది

4 Apr, 2018 00:49 IST|Sakshi

‘‘ధోనీ బయోపిక్‌ చాలా బాగా తీశారు. ఒక సినిమా హీరోగా...  క్రికెటర్‌ అనే ఒక నేషనల్‌ లెవల్‌ హీరో పాత్ర పోషిం^è మని ఎవరైనా సంప్రదిస్తే మాత్రం కొంత భయంగానే అనిపిస్తుంది’’ అన్నారు ఎన్టీఆర్‌. స్టార్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ‘‘చిన్నప్పటి నంచి నాకు క్రికెట్‌ అంటే ఇష్టం. ఎప్పుడూ గెలిచే టీమ్‌ పట్లే ప్రేమ చూపించేవాణ్ణి. సచిన్‌ ఆట చూస్తూ పెరగడం వల్ల అభిమాన క్రికెటర్‌ అనగానే సచిన్‌ అని మాత్రమే చెబుతా. నేను తొలిసారి సిక్స్‌ కొట్టింది ‘సింహాద్రి’ సినిమాతో (నవ్వుతూ). ఆ సిక్స్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. కాలక్రమంలో సిక్స్‌లే కాదు భయంకరమైన డకౌట్స్‌ కూడా నా కెరీర్‌లో ఉన్నాయి. అయితే ఆటల్లోలాగానే ఒక స్టేజ్‌ దాటాక సక్సెస్, ఫెయిల్యూర్స్‌ చాలా మామూలుగా అయిపోతాయి. గెలుపోటములుకి ఎవరూ అతీతులు కాదు’’ అన్నారు. 

అభిరామ్‌ క్రికెటర్‌ అయితే ఓకే
తనయుడు అభిరామ్‌ గురించి మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం నాకు క్రికెట్‌ చూడడం కన్నా ఆడడం బాగా ఇష్టం. మా అబ్బాయి అభిరామ్‌ ఈ మధ్యే థర్మాకోల్‌తో తయారైన బ్యాట్, ఓ ప్లాస్టిక్‌ బాల్‌ కొని నాతో క్రికెట్‌ ఆడేస్తున్నాడు. మరి.. క్రికెట్‌ మీద ఆ ఇష్టం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేను. ఒకవేళ అభిరామ్‌ క్రికెటర్‌ అయితే నాకు ఇష్టమే.  మన ఇష్టాలను పిల్లల  మీద రుద్దకూడదు. పిల్లలకి చక్కగా ఎదగడానికి  మంచి తిండి, చదువు, సురక్షితమైన ఇల్లు ఇవ్వడం, ఒక మంచి పౌరుడిగా ఉండడానికి తోడ్పడడమే పెద్దల బాధ్యత. వారి భవిష్యత్తు గురించి వాళ్లే నిర్ణయించుకునేలా చేయాలనేది నా అభిప్రాయం. మా నాన్నగారు నేను బాగా చదువుకోవాలని కోరుకున్నారు. మా అమ్మగారు నన్ను మంచి నృత్యకళాకారుడిగా చూడాలని కోరుకున్నారు. అయితే విధి నన్ను నటనవైపు తీసుకొచ్చింది’’ అని చెప్పారు.

బయోపిక్‌కి పిలుపు రాలేదు
రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలసి చేయబోతున్న సినిమా గురించి అడగ్గా – ‘‘రాజమౌళిగారు పూర్తి కథ చెప్పలేదు. మమ్మల్ని మాత్రం సినిమాలో నటించడానికి రెడీగా ఉండమన్నారు.  మా పాత్రలు అలరించే విధంగా ఉంటాయి’’ అని చెప్పారు. మీ తాత ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తీస్తున్న బయోపిక్‌లో మీరు నటిస్తారా? అనే ప్రశ్నకు – ‘‘నాకు పిలుపు రాలేదు. ఒకవేళ వస్తే మీ అందరికీ చెబుతా’’ అన్నారు. 

మరిన్ని వార్తలు