నాని కోసం ఎన్టీఆర్ పాట?

13 Sep, 2016 23:21 IST|Sakshi
నాని కోసం ఎన్టీఆర్ పాట?

మన కథానాయకులు, నాయికలు తమ చిత్రాలకు కొత్త హైప్ తీసుకొచ్చేందుకు పాటలు పాడేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. అయితే ఓ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడుతుండడం విశేషమనే చెప్పాలి. నాని హీరోగా త్రినాథరావు దర్శకత ్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
 
 ఈ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట పాడనున్నారని ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో తన చిత్రాలు ‘యమ దొంగ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’లో పాటలు పాడిన ఎన్టీఆర్, కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఆ మధ్య కన్నడంలోనూ ఓ పాట పాడారు. ఆ పాటలన్నీ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ‘నేను లోకల్’ కోసం మరోసారి తను సింగర్‌గా మారనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్, ‘దిల్’ రాజులతో ఉన్న స్నేహం వల్లే తారక్ మళ్ళీ ఇలా సింగర్ అవతారమెత్తుతున్నారని తెలుస్తోంది.