చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా..

4 Jun, 2020 08:52 IST|Sakshi

జూనియర్‌ ఆర్టిస్ట్‌ల జీవితాలపై కోవిడ్‌ దెబ్బ

ఉపాధి లేక అల్లాడుతున్న దుస్థితి

జీవితంలో వెలుగు కోసం ఎదురుచూపులు

జూబ్లీహిల్స్‌: చీకట్లను చీల్చుకుంటూ వచ్చే కిరణాలు వెండితెరపై పడగానే ఆ తెర ఒక్కసారిగా వెలుగులీనుతుంది. అదే వెండి తెర ఇప్పుడు కరోనా వైరస్‌ దెబ్బకు రెండు నెలవుతున్నా వెలుగుకు నోచుకోవడం లేదు. దాని వెనుకున్న జీవితాలు క్రమంగా చీకట్లోకి వెళ్తున్నాయి. జూనియర్‌ ఆర్టిస్ట్‌లకు అడ్డాగా ఉన్న కృష్ణానగర్, ఇందిరానగర్‌లలో తెల్లవారుజామున 4 గంటల నుంచే సందడి మొదలయ్యేది. ఆర్టిస్టులు వందలాదిగా యూనియన్‌ కార్యాలయాలకు చేరుకొని తమ షూటింగ్‌కు వెళ్తూ సాయంత్రం కాగానే ఇంటికి చేరుకునేవారు. బతుకుబండి కాస్త బాగానే నడిచేది. కరోనా దెబ్బకు సీన్‌ రివర్స్‌ అయింది. సినిమానే జీవితంగా బతికేవారికి ఇప్పుడు దిక్కుతోచడం లేదు. అప్పట్లో వయసులో ఉన్న వారికి సినిమా అవకాశాలు ఎక్కువగా దొరికితే 50 ఏళ్లు పైబడిన వారికి వారానికి రెండు రోజులైనా ఏదో ఒక షూటింగ్‌లో పని దొరికేది. కానీ ఇప్పుడు 50 ఏళ్లు దాటిన వారి పరిస్థితి దారుణంగా మారింది. సినిమా షూటింగ్‌లు ప్రారంభం అవుతాయని చెబుతున్నప్పటికీ తమకు పెద్దగా అవకాశాలు రావేమోననే భయం వారిని వెంటాడుతూనే ఉంది. అయినా పట్టు వదలకుండా ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని ఇప్పటికీ కూడా ప్రతిరోజూ జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ కార్యాలయం వద్దకు ఆర్టిస్ట్‌లు వస్తూనే ఉన్నారు. తమజీవితాల్లో వెలుగుల కోసం ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా..
40 ఏళ్ల నుంచి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాలు. వయసు పైబడిందని మామూలు సమయాల్లోనే అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చేవి. ఇప్పుడు అది కూడా లేదు. ఈ కష్టకాలంలో కూడా మెగాస్టార్‌ చిరంజీవి పంపిన సరుకులే దిక్కయ్యాయి. నాకు ఇల్లు లేదు. ఈ యూనియన్‌ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతుంటాను. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.
– కె.ప్రభావతి, యూసుఫ్‌గూడ

చావైనా.. బతుకైనా ఇక్కడే.. 

బీకాం చదివాను. చిన్నప్పుటి నుంచే సినిమాలంటే పిచ్చి. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యాను. వయసు పైబడిందని అవకాశాలు సరిగ్గా ఇవ్వడం లేదు. బతుకైనా చావైనా సినిమానే. 45 ఏళ్లుగా సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాను. మొదట్లో రోజుకు రూ.7 పారితోషికం తీసుకునేవాడిని.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. ఉపాధి కరువై ఇబ్బంది పడుతున్నా. ఇల్లు కూడా లేదు.
– బీఎల్‌. నర్సింహ, యూసుఫ్‌గూడ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు