ఆ మహిళలపై బీబర్‌ పరువునష్టం దావా

26 Jun, 2020 16:48 IST|Sakshi

పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు  చేసిన ఇద్దరు మహిళలపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తనపై ఆరోపణలు చేసిన ఒక్కో మహిళపై 10 యూఎస్‌ మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 75.6 కోట్లు) పరువు నష్టం దావా వేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని బీబర్‌ స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు నిరాధరమైనవని నిరూపించడానిని తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాలను ఓ ప్రముఖ మీడియా వెబ్‌సైట్‌ వెల్లడించింది.(చదవండి : స్వీయ నిర్బంధంలో ‘ముద్దు’ ముచ్చట)

ఈ ఆరోపణలు చేసినవారిలో ఒకరు.. 2014లో అస్టిన్‌లో జరిగిన సౌత్‌వెస్ట్‌ ఫెస్టివల్‌ చూసేందుకు వచ్చిన సమయంలో బీబర్‌ తనపై దాడి చేసినట్టుగా చెప్పారు. మరో మహిళ 2015 న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీబర్‌ తనపై దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. అయితే ఇవి రెండు కూడా పూర్తిగా కల్పితమైనవని.. ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే కుట్ర దాగి ఉందని బీబర్‌ పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు చర్యల వల్ల ఇతరుల పరువుకు భంగం వాటిల్లడమే కాకుండా.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఇదివరకే తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేయనున్నట్టు బీబర్‌.. ట్విటర్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు