పాఠశాలల గతిని మార్చే రాక్షసి

13 Jun, 2019 09:51 IST|Sakshi

వివాహానంతరం, అదీ ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత జ్యోతిక నటిగా పునఃప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తనకు తగ్గ పాత్రలను, అదీ కథానాయకి ప్రాముఖ్యత కలిగిన పాత్రలను ఎంచుకుని నటిస్తూ విజయాలను సాధిస్తున్నారు. అలా జ్యోతిక తాజాగా నటిస్తున్న చిత్రం రాక్షసి. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రకాశ్, ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సై.గౌతమ్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ.. మన పాఠశాలలో జరుగుతున్న, జరగాల్సిన విషయాల గురించి తనకెందుకులే అనుకోకుండా టీచర్‌ ధైర్యంగా ప్రశ్నిస్తుంటే ఈమె హీరో అని విద్యార్థులకు  అనిపిస్తుందన్నారు. అలాంటి రాక్షసి టీచర్‌ సీతారాణి ఇతివృత్తమే ఈ సినిమా అని తెలిపారు.

ప్రశ్నించడంతో సరిపెట్టుకునే వారిని కొంత కాలం తరువాత మరచిపోతామన్నారు. అయితే దాన్ని ఆచరణలో చూపించేవారే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. దాన్నే తాను తెరపై ఆవిష్కరించానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మార్చు తీసుకురావాలన్న విషయంలో మరో మాటకు తావు ఉండదన్నారు. ప్రభుత్వ పాఠశాలల తలరాతను మర్చే చిత్రంగా రాక్షసి ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల స్థాయిని, ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఉన్నతిని పెంచాలన్నదే ఈ చిత్ర ఉద్దేశంగా పేర్కొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఎందరో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల ఉన్నతి కోసం ఒంటరిగా పోరాడుతున్నారని, వారందరికీ సెట్యూట్‌ చేస్తున్నామని అన్నారు. ఇందులో నటి జ్యోతిక మినహా మరెవరూ రాక్షసి పాత్రలో అంత కచ్చితంగా నటించేవారు కాదని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు