మగవారంటే మంట!

6 Nov, 2018 11:13 IST|Sakshi

చెన్నై, పెరంబూరు: మగవారంటే మంట అంటోంది నటి జ్యోతిక. వివాహనంతరం నటిగా రీఎంట్రీ అయిన ఈమె 36 వయదినిలే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి సక్సెస్‌ అవ్వడంతో వరుసగా చిత్రాలు చేయడం మొదలెట్టారు. తాజాగా కాట్రిన్‌ మొళి చిత్రంలో నటించారు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 16న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నటి జ్యోతిక ఒక భేటీలో మాట్లాడుతూ అన్నీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లోనే నటిస్తున్నారేంటి అని చాలా మంది అడుగుతున్నారన్నారు. అయితే తనకు అలాంటి అవకాశాలే వస్తున్నాయని అన్నారు. అలాంటి చిత్రాలన్నీ మగవారే దర్శకత్వం వహిస్తున్నారన్నది గ్రహించాలన్నారు.

వారే అలాంటి కథలను, పాత్రలను తయారు చేస్తున్నారని పేర్కొంది. నిజానికి ఫలాన కథ కావాలని తానెప్పుడూ, ఏ దర్శకుడిని కోరలేదన్నారు. వారు చెప్పిన కథా పాత్ర తనకు నప్పుతుందని భావిస్తే అందులో నటించడానికి అంగీకరిస్తానన్నారు. నిజానికి ఇప్పుడు మహిళలకు సపోర్టు చేసే కథా చిత్రాల అవసరం ఏర్పడిందన్నారు. ఇప్పుడు అందరూ మీటూ గురించి మాట్లాడుతున్నారు.. ఈ సామాజిక మాధ్యమం 10 ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్నారు. అదే విధంగా తన చిత్రాల్లో పురుషులను చెడ్డ వారిగానే చిత్రీకరిస్తున్నారని అంటున్నారన్నారు. నిజం చెప్పాలంటే తనకు మగవారంటే కోపం అని చెప్పింది. ఇతర చిత్రాలలో మహిళలను తప్పుగా చూపడం లేదా? అని ప్రశ్నించారు.

ఆ చిత్రాల్లో నటీమణులకు ఒక్క సెన్సిబుల్‌ డైలాగ్‌ కూడా ఉండదనీ.. ఇదంతా మారితేనే సరి అడుతుందన్నారు. ఇకపోతే ఖుషీ–2 చిత్రం రూపొందిస్తే అందులో నటిస్తారా? అని అడుగుతున్నారన్నారు. ఆ చిత్రం రూపొందితే అందులో కచ్చితంగా నటిస్తానని చెప్పారు. ఆ చిత్రం మొదటి భాగంలా ఉండకూడదని, ఒక మెచ్యూర్డ్‌ జెనిఫర్‌ను ఖషీ–2లో చూపించాలని జ్యోతిక పేర్కొన్నారు. భర్త సూర్య తనకు పక్కాబలంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు