బిగ్‌బీ నన్ను నమ్మలేదు

26 Oct, 2017 05:47 IST|Sakshi

తమిళసినిమా: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ తనను నమ్మలేదని సీనియర్‌ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్‌ వ్యాఖ్యానించారు. ప్రముఖ గీతరచయిత, దర్శకుడు, పత్రికాసంపాదకుడు ఎంజీ.వల్లభన్‌ గురించి పాత్రికేయుడు అరుళ్‌సెల్వన్‌ సేకరించి రాసిన సకలకళావల్లభన్‌ నవల ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్‌ నటుడు శివకుమార్‌ నవలను ఆవిష్కరించగా తొలిప్రతిని ఆవిష్కరించగా కే.భాగ్యరాజ్‌ అందుకున్నారు.

ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి స్నేహితులను బట్టి ఆయన ఎలాంటి వాడో అర్థం అయిపోతుందన్నారు. అలా ఎంజీ.వల్లభన్‌ స్నేహితులను బట్టే ఆయన ఎంత ప్రతిభావంతుడో తెలుసుకోవచ్చునన్నారు.మలయాళీ అయిన ఎంజీ.వల్లభన్‌ తమిళ సాహిత్యం చూసి తానే ఆశ్చర్యపోయానని అన్నారు. తాను ఒక మలయాళ చిత్రంలో నటించి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావన్నారు.అదే విధంగా తాను హిందీలో ఆఖరిరాస్తా చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు ఆ చిత్రం కోసం తాను రాసిన ఆంగ్ల సంభాషణలు చూసి నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు తనపై నమ్మకం కలగలేదన్నారు.

ఆ తరువాత చిత్రం చూసిన ఆయన సహాయక బృందం చప్పట్లు కొట్టడంతో ఆయనకు సంతృప్తి కలిగిందని తెలిపారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని అన్నారు. ఎంజీ.వల్లభన్‌ వంటి సాహితీవేత్త తన భాగ్య పత్రికలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని తాను భావించలేదని, అలాంటిది ఆయన భాగ్య పత్రిక బాధ్యతలను నిర్వహించడంతో తాను ఎలాంటి చింతా లేకుండా షూటింగ్‌లకు వెళ్లానని చెప్పారు.

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్టుగా పాత విషయాలకెప్పుడూ విలువ ఉంటుందన్నారు. మిత్రులతో పాత విషయాల గురించి చర్చించుకున్నప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను తెలుకోవచ్చునని అన్నారు. అలా ఎంజీఆర్, శివాజీగణేశన్‌ల నుంచి ధనుష్‌ కాలం వరకూ ఉన్న ఏజీ.వల్లభన్‌ అనుభవాలను కూడా పుస్తకంగా తీసుకోస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కే.భాగ్యరాజ్‌ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు