టాప్‌ హీరోయిన్‌ అవుతావన్నాను

13 Mar, 2020 03:39 IST|Sakshi
శ్రీవాస్, పూరి జగన్నాథ్, వైవీయస్‌ చౌదరి, రాఘవేంద్రరావు, అనుష్క, చార్మి, హేమంత్, విశ్వప్రసాద్, కోన వెంకట్, శ్యాంప్రసాద్‌ రెడ్డి

– కె.రాఘవేంద్రరావు

‘‘స్వీటీ (అనుష్క)ని ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పుడే సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌ అవుతావన్నాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ తను ఈ స్థాయికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ప్రయత్నిస్తే సినిమాలు దొరుకుతాయి. కానీ, పాత్రలన్నీ నిన్ను (అనుష్క) వెతుక్కుంటూ వచ్చాయి.. ఏ హీరోయిన్‌కీ ఆ అవకాశం దక్కలేదు’’ అన్నారు డైరెక్టర్‌ కె. రాఘవేంద్రరావు. అనుష్క లీడ్‌ రోల్‌లో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలవుతోంది.

‘సూపర్‌’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క ఫిల్మ్‌ ఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్‌ 15 ఇయర్స్‌ ఆఫ్‌ అనుష్క’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్‌ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. కానీ, దేవసేన పాత్ర ఇచ్చినందుకు గర్వపడుతున్నా. ‘నిశ్శబ్దం’ టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి.. ఏప్రిల్‌ 2న సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘హీరోయిన్లలో అనుష్కలాంటి మంచి అమ్మాయి ఉండటం అరుదు’’ అన్నారు డి. సురేశ్‌ బాబు.

నిర్మాత శ్యాం ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ–  ‘‘ఐదారు నెలల క్రితం జార్జియాకి వెళ్లాను. అక్కడ కారు డ్రైవర్, కేర్‌ టేకర్‌ గాజా ‘మీకు స్వీటీ (అనుష్క) తెలుసా?’ అన్నాడు. సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఓ తమిళ సినిమా షూటింగ్‌ కోసం అనుష్క జార్జియాలో ఉన్నప్పుడు గాజానే కారు డ్రైవర్, కేర్‌ టేకర్‌గా ఉండేవాడు. తన కారుని ఫైనాన్స్‌ వాళ్లు తీసుకెళ్లిపోతే అనుష్క కొత్త కారు కొనిచ్చిందట. అంత మంచి అమ్మాయి. మంచి టీమ్‌తో తను చేసిన ‘నిశ్శబ్దం’ పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు.  

‘‘స్వీటీ.. నీ కెరీర్‌లో మరో పదేళ్లలో సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటావని కచ్చితంగా చెబుతున్నా’’ అన్నారు నిర్మాత పీవీపీ. ‘‘సూపర్‌’ సినిమా హీరోయిన్‌ కోసం ముంబై వెళ్లా. అక్కడ అనుష్క వచ్చింది. ఏం చేస్తుంటావని అడిగితే యోగా టీచర్‌ అంది. నాగార్జునగారికి చూపించి, ఆడిషన్స్‌ చేద్దామన్నాను.. చాలా బాగుంది.. ఏం పర్లేదు ఆడిషన్స్‌ వద్దన్నారాయన. వినోద్‌ బాల వద్ద నటన నేర్చుకుంది. ‘నిశ్శబ్దం’  బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.

అనుష్క మాట్లాడుతూ– ‘‘సూపర్‌’ నుంచి ‘నిశ్శబ్దం’ వరకూ ఎందరో డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ పదిహేనేళ్లలో మంచీ, చెడులు తెలిశాయి’’ అన్నారు. ‘‘అనుష్కగారితో ‘నిశ్శబ్దం’ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు  టీజీ విశ్వప్రసాద్‌ ‘‘అనుష్క కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు హేమంత్‌ మధుకర్‌. ‘‘అనుష్క నిజంగానే ‘లేడీ సూపర్‌స్టార్‌’. తన మంచి లక్షణాలతో ఓ పుస్తకం రాయొచ్చు’’ అన్నారు కోన వెంకట్‌. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కిరణ్, శోభు యార్లగడ్డ, చార్మీ, ప్రశాంతి, అభిషేక్‌ అగర్వాల్, వివేక్‌ కూఛిబొట్ల, డైరెక్టర్లు శ్రీవాస్, దశరథ్, వైవీఎస్‌ చౌదరి, వీరూ పోట్ల, హీరోయిన్‌ అంజలి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు