చరణ్ సినిమా తీస్తే నేనూ బాలూ నటిస్తాం : కె. విశ్వనాథ్

24 Jan, 2015 23:26 IST|Sakshi
చరణ్ సినిమా తీస్తే నేనూ బాలూ నటిస్తాం : కె. విశ్వనాథ్

 ‘‘చరణ్ నన్ను పెదనాన్నా అని పిలిచినప్పుడు పొందిన ఆనందంకన్నా, తను నిర్మాతగా మారడం ఇంకా ఆనందంగా అనిపించింది. తమిళంలో మంచి చిత్రాలు నిర్మించిన తను తెలుగులో కూడా నిర్మాతగా అడుగుపెట్టడం మరింత ఆనందమనిపించింది. మధుమిత దర్శకత్వంలో చరణ్ నిర్మించిన ఈ చిత్రం పాటలు చూశాను. అద్భుతంగా ఉన్నాయి. నేను, నా తమ్ముడు బాలూ కాంబినేషన్లో చరణ్ ఓ సినిమా నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని కళాతపస్వి కె. విశ్వనాథ్ అన్నారు. క్యాపిటల్ ఫిలిమ్ వర్క్స్ సమర్పణలో మధుమిత దర్శకత్వంలో తెలుగు,
 
 తమిళ భాషల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’. ప్రముఖ రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి, వెంకీ, అదితీ చెంగప్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రలు పోషించారు. కార్తికేయ మూర్తి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కె. విశ్వనాథ్ ఆవిష్కరించి, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకి ఇచ్చారు. ఈ వేడుకలో చంద్రమోహన్, తనికెళ్ల భరణి, శివలెంక కృష్ణప్రసాద్, కోటి, వెన్నెలకంటి, శశాంక్ వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు.
 
 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ -‘‘తమిళంలో ప్రస్తుతం అగ్రదర్శకులుగా ఉన్న వెంకట్ ప్రభు, సముద్రఖని వంటివారికి ముందు అవకాశం ఇచ్చింది చరణే. ఇప్పుడో మంచి కథాంశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. తమిళంలోలానే తెలుగులో కూడా సక్సెస్‌ఫుల్ నిర్మాత అనిపించుకుంటాడనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘విశ్వనాథ్, బాలూ మాదంతా ఓ కుటుంబం. చరణ్ నాకు కొడుకులాంటివాడు. అందుకే ఇది నాకు సొంత సినిమాలాంటిది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చరణ్ తెలిపారు.