‘యురి’ని వెనక్కునెట్టిన ‘కబీర్‌సింగ్‌’

10 Jul, 2019 18:45 IST|Sakshi

ముంబై: కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన కబీర్‌ సింగ్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై మూడువారాలు గడిచినప్పటికీ, కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే అతి భారీ విజయాన్నిఅందించిన ఈ చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 10 చిత్రాల్లో కబీర్‌సింగ్‌ చోటు దక్కించుకుంది. యురి-ద సర్జికల్‌ స్ట్రైక్‌ను 11వ స్థానానికి నెట్టి పదవ స్థానాన్ని కబీర్‌ సింగ్‌ కైవసం చేసుకుంది. బాహుబలి 2, దంగల్‌, సంజు చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి.

మిశ్రమ టాక్‌తో ప్రారంభమైన కబీర్‌ సింగ్‌ ఎన్నో మైలురాళ్లను తన ఖాతాలో వేసుకుంటూ పోతోంది. కలెక్షన్లతో విమర్శకుల నోళ్లు మూయించిన కబీర్‌ సింగ్‌ 2019లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యేడాది భారీ వసూళ్లను రాబట్టిన సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’, విక్కీ కౌశల్‌ ‘యురి-ద సర్జికల్‌ స్ట్రైక్‌’ను వెనక్కు నెట్టి రూ.243 కోట్లతో దూసుకుపోతూ కబీర్‌ సింగ్‌ సంచలనాలు సృష్టిస్తోంది. బుధవారం ప్రతిష్టాత్మక భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఉన్నప్పటికీ కబీర్‌సింగ్‌ కలెక్షన్లపై ప్రభావం పడదని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. జూన్‌ 21న విడుదలైన కబీర్‌ సింగ్‌ హింసాత్మకంగా, అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శల దుమారం రేగినప్పటికీ రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది.

>
మరిన్ని వార్తలు