కాదలి... అంటే ఏంటి?

13 Feb, 2017 23:56 IST|Sakshi
కాదలి... అంటే ఏంటి?

ప్రేమ.. ఇష్క్‌.. కాదల్‌... భాష మారుతుందేమో కానీ భావం ఎప్పుడూ మారదు. ఏ భాషలో చెప్పినా ప్రేమ ప్రేమే. అందుకే, ఎన్ని ప్రేమకథలొచ్చినా ప్రేక్షకులెప్పుడూ ఆసక్తి కనబరుస్తారు. వాళ్ల ఆసక్తిని మరింత పెంచుతూ... ‘కాదలి’ చిత్ర బృందం సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటోంది. హరీశ్‌ కల్యాణ్, సాయి రోనక్, పూజ కె.దోషి ముఖ్యతారలుగా అనగనగన ఫిల్మ్‌ కంపెనీ (ఏఎఫ్‌సీ) పతాకంపై పట్టాభి ఆర్‌.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘కాదలి’. తమిళంలో ‘కాదలి’ అంటే ప్రేయసి. మరి.. ఈ టైటిల్‌ తెలుగు సినిమాకి పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ‘‘ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమకథే ఈ సినిమా. ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబుగారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిత్రమిది’’ అన్నారు పట్టాభి ఆర్‌.చిలుకూరి. సుదర్శన్, భద్రమ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: ప్రసన్న ప్రవీణ్‌ శ్యాం, కెమేరా: శేఖర్‌ వి.జోసెఫ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఆనంద్‌ రంగ.