ఇరవై భాషల్లో పాడాను!

17 Apr, 2016 23:44 IST|Sakshi
ఇరవై భాషల్లో పాడాను!

కైలాశ్ ఖేర్  పాడితే పాట సూటిగా గుండెల్లోకి దూసుకెళుతుంది. సంగీతం మీద ఇష్టంతో చిన్నతనంలోనే ఇంటికి దూరమైన కైలాశ్ చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సంగీతం మీద ప్రేమతో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు దేశంలో ఓ ప్రఖ్యాత  గాయకుల్లో ఒకరుగా మారారు. హిందీలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాశ్ తెలుగు శ్రోతలకూ సుపరిచితమే.  ‘జేజమ్మా... రావమ్మా’, ‘పండగలా దిగి వచ్చాడు’ వంటి పాటలతో ఇక్కడివారినీ ఆకట్టుకున్నారు. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం కోసం ఓ  పాట పాడారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కైలాశ్ మాట్లాడుతూ-‘‘నాకు పాటలు  పాడ టంలో భాషా భేదం లేదు.  ఆ పాటలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటే చాలు ఈజీగా పాడేస్తా. అందుకే ఇప్పటికి 20 పైగా భాషల్లో పాడగలిగాను. ‘నిర్మలా కాన్వెంట్’ కోసం ‘ముందు నుయ్యి-వెనుక గొయ్యి’ అనే పాట పాడా. 60, 70 దశకాల్లోని పాటలను తలపించిందీ పాట. ఇప్పటివరకూ తెలుగులో నేను పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని చెప్పారు.