ఇచ్చింది పుచ్చుకుని నటించా!

9 Nov, 2016 04:25 IST|Sakshi
ఇచ్చింది పుచ్చుకుని నటించా!

 డబ్బు..డబ్బు..డబ్బు. ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఇందుకు అతీతులంటూ ఎవరూ ఉండరు. ఇక తారల విషయానికి వస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీను అనుసరిస్తుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్‌కు అధిక పారితోషికం చెల్లిస్తే తానూ ఆడటానికి రెడీ అని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తానేమీ తక్కువ కాదు అంటున్నారు నటి కాజల్ అగర్వాల్.
 
  ఈ అమ్మడు కూడా ఈ మధ్య తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌లో నేను పక్కా లోకల్ అంటూ సింగిల్ సాంగ్‌లో రెచ్చిపోయి స్టెప్పులేశారన్నది గమనార్హం. అందుకు తగిన పారితోషికాన్ని పుచ్చుకున్నారు. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తమిళంలో అజిత్ 57వ చిత్రంతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, నటుడు రానాతో మరో చిత్రంలో నటిస్తున్నారు. ధనుష్‌తో మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే జీవాకు జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
 
 ఈ సందర్భంగా నటి కాజల్ పేర్కొంటూ సాధారణంగా హీరోయిన్లు మంచి కథ, కథాపాత్ర ఉంటే చాలని అంటుంటారన్నారు. వాటితో పాటు మంచి పారితోషికం కూడా చాలా ముఖ్యమని తాను అంటానన్నారు. తాను 22 ఏళ్ల వయసులో చిత్రరంగ ప్రవేశం చేశానని, తనకు ఇక్కడ గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరని చెప్పారు. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. మొదట్లో ఇచ్చిన పారితోషికాన్ని కాదనకుండా పుచ్చుకుని నటించేదాన్నని, అదే విధంగా వచ్చామా.. నటించామా.. వెళ్లామా.. అన్నట్టుగా ఉండేదాన్నన్నారు.
 
 అలాగే కొన్ని చేయకూడని చిత్రాలు చేశానని, కొన్ని తప్పటడుగులు వేశానని చెప్పారు. ఆ తరువాత కాస్త తెలివిమీరానని , అయితే అతితెలివి కూడా ఇక్కడ పనికిరాదన్నారు. పారితోషికం చాలా ముఖ్యం అని గ్రహించానని చెప్పారు. ప్రతి ఏడాది చేసిన చిత్రాలు, పొందిన పారితోషికాన్ని క్యాలుక్యులేట్ చేసుకుని తరువాత ఏడాది నటించే చిత్రాలకు పారితోషికం గురించి నిర్ణయించుకుంటానని తెలిపారు. అదే విధంగా పాత్రల ఎంపిక విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటున్నాననీ, పాత్ర, పారితోషికం సంతృప్తిగా ఉంటేనే నటించడానికి అంగీకరిస్తున్నానని కాజల్‌అగర్వాల్ పేర్కొన్నారు.