సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

21 Aug, 2019 02:10 IST|Sakshi
కాజల్‌ అగర్వాల్‌

‘‘మా కష్టాన్ని వృథా చేయకండి’’ అని వాపోతున్నారు కాజల్‌ అగర్వాల్‌. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్యారిస్‌ ప్యారిస్‌’. హిందీ హిట్‌ చిత్రం ‘క్వీన్‌’కు ఇది తమిళ రీమేక్‌. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పాతిక కత్తెర్లు ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌. దీంతో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రబృందం రివైజింగ్‌ కమిటీకి వెళ్లింది. ఇటీవల ఈ విషయంపై కాజల్‌ అగర్వాల్‌ ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందిస్తూ –‘‘హిందీ ‘క్వీన్‌’ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చూపించాలని ఓ మంచి ప్రయత్నం చేశాం. కానీ సెన్సార్‌ వారు ఇన్ని కట్స్‌ చెప్పారన్నప్పుడు షాకయ్యాను.

వారు చెప్పిన కట్స్‌లో చాలా సన్నివేశాలు మన నిత్య జీవితంలో జరిగేవే ఉన్నాయి. ఈ విషయమే నిర్మాతలకూ చెప్పి సరైన యాక్షన్‌ తీసుకోమని కోరాను. ఈ సినిమా కోసం చాలా కాలం సమష్టిగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని అందుకోవాలనుకుప్పుడు ఇలా జరుగుతోంది. ఎటువంటి సెన్సార్‌ కట్స్‌ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. హిందీ ‘క్వీన్‌’ చిత్రం తెలుగు వెర్షన్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మి’గా మలయాళంలో ‘జామ్‌ జామ్‌’గా, కన్నడలో ‘బటర్‌ఫ్లై’గా రీమేక్‌ అయ్యాయి. ‘జామ్‌ జామ్‌’, ‘బటర్‌ ఫ్లై’ చిత్రాలకు సెన్సార్‌ బోర్డ్‌ యుఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు