వారితో సంబంధాలు లేవు!

28 Jun, 2018 07:52 IST|Sakshi

తమిళసినిమా: అందాల నటి కాజల్‌ కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో దాదాపు ప్రముఖ నటులందరితోనూ నటించేసింది. తమిళంలో విజయ్, అజిత్, విశాల్, సూర్య, కార్తీ, అదేవిధంగా తెలుగులో మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల నుంచి చిరంజీవి వరకూ జత కట్టేసి ప్రముఖ కథానాయకిగా అంతస్తుకు చేరుకుంది. తాజాగా హిందీ చిత్రం క్వీన్‌ తమిళ రీమేక్‌లో నటిస్తోంది. రెండు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న కాజల్‌ ఇప్పుడు యువ హీరోలతో నటించడానికే ఆసక్తి చూపుతుదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకూ స్టార్‌ హీరోలతో జత కట్టిన మీరు ఇప్పుడు కుర్ర హీరోలతో నటించడానికి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం. నేను యువ హీరోలతో నటించడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ, నిజానికి నేనెప్పుడూ నాతో జత కట్టే హీరో ఎవరన్న విషయం గురించి పట్టించుకోలేదు. నాకు ఇచ్చిన పాత్ర ఎలాంటిదన్న దానిపైనే దృష్టి సారిస్తాను.

హీరోలెవరైనా నటించవచ్చు. అయితే నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. ఆ పాత్రను నేను బాగా చేయాలి అనే కోరుకుంటాను. నిజమే నాతో చాలా మంది ప్రముఖ నటులు నటించారు. అయితే వారెవరితోనూ నాకు స్నేహసంబంధాలు కూడా లేవు. నా ఆసక్తి ఏమిటన్నది దీని నుంచే అర్థం చేసుకోవచ్చు. సినిమాలో చాలా మార్పు వస్తోంది. అందుకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుంటున్నాను. కొత్తగా నటించాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. ఈ బ్యూటీ చెల్లెలు నిషా అగర్వాల్‌ ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా ఏళ్లే అయ్యింది. మీ పెళ్లి ఎప్పుడమ్మా అని అడిగితే ప్రస్తుతం నేను చిత్రాలతో బిజీగా ఉన్నానని, పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని చెబుతోంది. అయితే ఈ బ్యూటీకి ఒక ప్రేమికుడు ఉన్నాడని, ఏదో ఒక రోజున సడన్‌గా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. నటి శ్రియ మాదిరిగా చడీ చప్పుడు లేకుండా పెళ్లి ముచ్చట ముగించుకుని తీరిగ్గా వెల్లడించే అవకాశం లేకపోలేదనే వారూ లేకపోలేదు.

మరిన్ని వార్తలు