ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్‌సిగ్నల్?

18 Jun, 2016 22:24 IST|Sakshi
ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్‌సిగ్నల్?

ఇప్పటివరకూ కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాజల్ అగర్వాల్ దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఓ నాలుగైదు చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారు. ఐటమ్ సాంగ్స్ మాత్రం చేయలేదు. ఈ ఏడాది అది కూడా చేయనున్నారని సమాచారం. రామ్‌చరణ్ సరసన ‘మగధీర’, ‘నాయక్’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాల్లో కథానాయికగా నటించిన కాజల్ ఇప్పుడు ఈ హీరోతో ప్రత్యేక గీతానికి నర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
 
 తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధ్రువ’లో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌తో రకుల్ ప్రీత్‌సింగ్ జతకట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులోనే కాజల్ అగర్వాల్ ఒక ప్రత్యేక నృత్య గీతంలో కనిపించనున్నారని వినికిడి.
 
  ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం కాజల్ తమిళంలో ‘కవలై వేండామ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, తన తొలి చిత్రం ‘లక్ష్మీ కల్యాణం’ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరో రానా దగ్గుబాటి సరసన నటించనున్నారు. ఆ మధ్య కథానాయకుడు రానా, కాజల్ పాల్గొనగా ఫొటోషూట్ కూడా చేశారు.