అలాంటి విమర్శలు పట్టించుకోను!

4 Apr, 2018 10:31 IST|Sakshi
కాజల్‌ అగర్వాల్‌

తమిళసినిమా : మా గురించి ఆలోచించిండి అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ఉత్తరాదికి చెందిన ఈ భామ బాలీవుడ్‌లో పెద్దగా రాణించలేకపోయినా దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో నటించిన మగధీర... కాజల్‌ కెరీర్‌కు పెద్ద టర్నింగ్‌ అని చెప్పాలి. ఇక కోలీవుడ్‌లో విజయ్, అజిత్, ధనుష్‌ అంటూ స్టార్‌ హీరోలతో జత కట్టింది. నటిగా దశాబ్దం దాటినా హీరోయిన్‌ స్థానాన్ని పదిల పరుచుకున్న  ఈ అమ్మడి అభిప్రాయాలను చూద్దాం. 

‘సినిమాల్లో 10 ఏళ్లుగా నటిస్తుండడం సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే నటిగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. అయితే ఈ అంతస్తు అంత సులభంగా రాలేదు. దీని వెనుక నా శ్రమ, ప్రతిభ, దేవుడి ఆశీర్వాదం ఉన్నాయి. అదే విధంగా అభిమానుల ఆదరణ కూడా ఉంది. ఇకపోతే నటీమణులకు రక్షణ లేదని భావిస్తున్నారా? అని కొందరు అడుగుతున్నారు. నా తల్లిదండ్రులు నన్ను ధైర్యవంతురాలిగానే పెంచారు. దేనికీ భయపడను. అయితే నటీమణులకు బహిరంగ ప్రాంతాల్లో కొంత అసౌకర్యం కలుగుతోంది. మేము అభిమానుల సంతోషం కోసం శ్రమిస్తున్నాం. మా భావాలను వారు అర్థం చేసుకోవాలి. నటీమణులకు వ్యక్తిగత జీవితం ఉంటుందన్నది గ్రహించాలి. 

కేవలం కొందరి వల్ల మాలాంటి వాళ్లు బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. పేరు, ప్రతిష్టల కోసం స్వతంత్య్రాన్ని త్యాగం చేయాల్సివస్తోంది. ఇక మాపై విమర్శలు చాలానే వస్తుంటాయి. అయితే అలాంటి వాటిని నేను పట్టించుకోను. ఒక సాధారణ యువతిగా ఉంటే నా జీవితం ఒక చిన్న ప్రపంచంగానే మిగిలిపోయేది. నటిగా ప్రపంచ స్థాయిలో పరిచయం అయ్యాను. కొందరు సినిమా వృత్తిని హీనంగా మాట్లాడుతున్నారు. అన్ని రంగాల్లోనూ మంచి చెడు ఉన్నాయి. వక్ర దృష్టితో చూస్తే అంతా చెడుగానే కనిపిస్తుంది. నా వరకూ నేను సినిమాను గౌరవిస్తాను. ఇక నటికి అందం ముఖ్యం కాబట్టి నిత్యం యోగా, ధ్యానం చూస్తూ దాన్ని కాపాడుకుంటున్నాను’. అన్నారు.

మరిన్ని వార్తలు