ఆమె నటన చూసి కమల్‌ గర్వపడతారు

20 Aug, 2017 03:57 IST|Sakshi
ఆమె నటన చూసి కమల్‌ గర్వపడతారు

తమిళసినిమా: వివేకం చిత్రంలో ఆ చిత్ర కథానాయకుడు అజిత్‌ అసాధారణ నటనను చూస్తారని బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ఓబరాయ్‌ పేర్కొన్నారు. అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం వివేకం. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి శివ దర్శకుడు. నటి కాజల్‌అగర్వాల్‌ నాయకిగా, నటుడు కమలహసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబరాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఈయన ప్రతినాయకుడిగా నటించినట్లు ప్రచారంలో ఉంది. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వివేకం చిత్ర ప్రమోషన్‌లో భాగం చెన్నైకి వచ్చిన వివేక్‌ఓబరాయ్‌ శనివారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు.

ప్ర: వివేకం చిత్రంలో నటించడానికి కారణం?
జ: ఒక రోజు దర్శకుడు శివ నన్ను కలిసి వివేకం చిత్ర కథ వినిపించారు. వెంటనే నటించడానికి ఓకే చెప్పేశాను. ఆయన వివేకం చిత్ర కథను నెరేట్‌ చేసిన విధం నాకు చాలా నచ్చింది. కథ, నా పాత్ర బాగుండడంతో నటించడానికి అంగీకరించాను.

ప్ర : నటుడు అజిత్‌ గురించి?
జ: అజిత్‌ నాకు మంచి మిత్రుడు. ఆయనతో ఈ చిత్ర జర్నీ మంచి అ నుభూతినిచ్చింది. వివేకం చిత్రం అంతర్జాతీయ స్థాయి కథా చిత్రం. ఇందులో మిషన్‌లో మేమిద్దరం కలిసి పని చేశాం. బల్గేరియాలో జీరో డిగ్రీల శీతల ఉష్ణంలో బేర్‌ బాడీతో ఆయన చేసిన సాహసాలు అబ్బు ర పరుస్తాయి. ఇక వివేకం చిత్రం గురించి చెప్పడానికి మాటలు చాలవు. దర్శకుడు శివ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు.

ప్ర: నటి కాజల్‌అగర్వాల్‌ నటన గురించి?
జ: నిజం చెప్పాలంటే కాజల్‌ అగర్వాల్‌ నటనను చూసి ఆశ్చర్యపోయాను. వివేకం చిత్రంలో ఆమె నటన అబ్బురపరచింది.

ప్ర: నటి అక్షరహాసన్‌ నటన గురించి
జ: అక్షరహాసన్‌ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆమె పాత్ర వివేకం చిత్రానికి చాలా కీలకంగా ఉంటుంది. చాలా మంచి నటి. ఈ చిత్రంలో అక్షరహాసన్‌ నటనను చూసి ఆమె తండ్రి కమలహాసన్‌ గర్వపడతారు.

ప్ర: మీరీమధ్య ఎక్కువగా నటించడం లేదే?
జ: అవకాశాలు చాలా వస్తున్నాయి. అయితే నాకు నటన ఒక్కటే కాదు, నా కుటుంబం, వ్యాపారం, ఇతర సామాజిక సేవాకార్యక్రమాలు అంటూ చాలా ఉన్నాయి.

ప్ర: తమిళంలో అవకాశాలు వస్తే నటిస్తారా?
జ: నటించాలన్న కోరిక నాకూ ఉంది.అయితే ఇక్కడ ప్రధాన సమస్య భాష. అయినా మంచి కథా చిత్రాలు వస్తే నటించడానికి రెడీ.

ప్ర: చెన్నై గురించి?
జ: చెన్నై నాకు చాలా నచ్చిన నగరం. మా పెద్దమ్మ, అక్కచెల్లెళ్లు అంటూ చాలా మంది బంధువులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇడ్లీ, దోసెలు అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా స్టైల్‌కింగ్‌ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ లాంటి ఐకాన్‌లు నివశిస్తున్న నగరం చెన్నై. తమిళ చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం.

ప్ర:  ఆ మధ్య తమిళనాడులో తుపాన్‌ సంభవించినప్పుడు మీరు చాలా సాయం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా?
జ: అది చాలా ఎమోషన్‌ సంఘటన. బాధితులను ఆదుకోవడం అన్నది మనిషిగా ప్రతి ఒక్కరి బాధ్యత. మావనతాదృక్పథంతోనే నేను అప్పుడు తమిళ ప్రేక్షకులకు సేవలందించాను.అంతేకానీ నాకు రాజకీయ రంగప్రవేశం ఆలోచన లేదు.