ఆ పేర్లు చెబితే మీరు అవాక్కవుతారు : కాజల్ అగర్వాల్

29 Jun, 2013 03:49 IST|Sakshi
ఆ పేర్లు చెబితే మీరు అవాక్కవుతారు : కాజల్ అగర్వాల్

 మొన్నటిదాకా కాజల్ అగర్వాల్ తెలుగుతెరపై నంబర్‌వన్ హీరోయిన్. ఆమె చేసిన సినిమాలు, అవి సాధించిన విజయాలు ఆమెను నంబర్‌వన్ ప్లేస్‌లో కూర్చోపెట్టాయని చెప్పాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ మరాఠీ మందారానికి కాలం అంతగా కలిసి రావడంలేదు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన బాద్‌షా’ చిత్రం బాక్సాఫీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.

 

ఆ సినిమా తర్వాత కూడా కాజల్‌కి తెలుగులో ఒక్క అవకాశం కూడా రాకపోవడం గమనార్హం. రామ్‌చరణ్ ఎవడు’ చిత్రంలో చేస్తున్నా... అందులో ఈ ముద్దుగుమ్మది అతిథి పాత్ర మాత్రమే. ఉన్నట్టుండి తెలుగులో అవకాశాలు తగ్గడానికి కారణం? అని కాజల్‌ని అడిగితే -‘‘అవకాశాలు తగ్గలేదు. నేనే తగ్గించుకున్నాను. ప్రస్తుతం తమిళంలో ఆల్ ఇన్ ఆల్ అళగురాజా, జిల్లా చిత్రాల్లో చేస్తున్నాను.

 

ఆరు నెలల పాటు నా డేట్స్ అన్నీ ఆ రెండు సినిమాలకే కేటాయించాల్సి వచ్చింది. అందుకే తెలుగు సినిమాలు ఒప్పుకోలేకపోయాను. ఈ కారణంగానే నేను వదులుకున్న సినిమాల లిస్ట్ పెద్దదే అని చెప్పాలి. ఆ సినిమాల పేర్లు చెబితే మీరు అవాక్కవుతారు. అన్ని భాషల్లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం నా లక్ష్యం. అందులో భాగంగానే అప్పుడప్పుడు బాలీవుడ్‌వైపు, కోలీవుడ్ వైపు చూస్తున్నాను. అయితే... నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం తెలుగు సినిమాకే. ఎప్పటికీ నేను తెలుగు నటినే’’ అని చెప్పారు.

>