ఇండియన్‌–2లో ఎంటర్‌ అయ్యింది

11 Feb, 2020 11:24 IST|Sakshi
ఇండియన్‌–2లో కమలహాసన్‌ , కాజల్‌ అగర్వాల్‌

సినిమా : ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం నటి కాజల్‌అగర్వాల్‌కు రానే వచ్చింది. అదే కమలహాసన్‌తో కలిసి నటించే అవకాశం. అవును నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్‌ 2. ఇది 1996లో ఆయన నటించిన ఇండియన్‌ చిత్రానికి సీక్వెల్‌. స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి కాజల్‌అగర్వాల్, రహుల్‌ప్రీత్‌సింగ్, ప్రియాభవానీశంకర్‌ వంటి నటీమణులు నటిస్తున్నారు. వీరి పాత్రలపై చాలా ఆసక్తి నెలకొంది. నటి కాజల్‌అగర్వాల్‌ 83 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందన్న విషయం బయటకి లీక్‌ అయ్యింది. దీన్ని నటి కాజల్‌నే వెల్లడించింది. ఇటీవల తన మేకప్‌ వేసుకుంటున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అందులో కాజల్‌ ముఖం మాత్రం కనిపించలేదు. కాజల్‌అగర్వాల్‌ శనివారం ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. నటుడు కమలహాసన్‌ ఈ నెల 13వ తేదీ నుంచి షూటింగ్‌లో పాల్గొనున్నట్లు తెలిసింది.

నిజానికి ఈయన చాలా రోజుల క్రితమే ఇండియన్‌ 2 చిత్ర షూటింగ్‌లో పాల్గొనాల్సింది. కాలుకు శస్త్ర చికిత్స జరగడంతో విదేశాల్లో నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ లోగా కమలహాసన్‌ లేని సన్నివేశాలను శంకర్‌ చిత్రీకించారు. ఇప్పుడు చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిలిం సిటీలో ఇండియన్‌ 2 చిత్రం కోసం భారీ సెట్‌ను వేసినట్లు తాజా సమాచారం. అక్కడ కంటిన్యూగా 35 రోజుల పాటు చిత్రీకరణను జరపనున్నట్లు తాజా సమాచారం. ఇందులో చిత్రంలోని కీలక సన్నివేశాలను «శంకర్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ సంగీత భాణీలు అందిస్తున్నారు. కమలహాసన్‌ చిత్రానికి ఆయన పని చేయడం ఇదే తొలిసారి. అదేవిధంగా శంకర్‌తో కలిసి పని చేయడం  ఇదే ప్రప్రథం. రత్నవేలు ఛాయాగ్రహణను, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇండియన్‌ చిత్రంలో కమలహాసన్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినం చేసిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌లో డబుల్‌ రోల్స్‌ పోషిస్తున్నారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుటి వరకూ శంకర్‌ అధికారికంగా ఇండియన్‌ 2 చిత్రానికి సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. చిత్రంలో ఇండియన్‌ గెటప్‌ మాత్రమే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇందులో ఆ పాత్ర పేరు సేనాపతి అని తాజాగా తెలిసింది. ప్రస్తుతం ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలనే దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు