తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి

30 Sep, 2019 09:28 IST|Sakshi

బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌

ముంబై : త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌ తెలిపారు. తన సహచరుడు గయ్ హర్ష్‌బర్గ్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతిని అని.. గోవాలో ప్రసవం కోసం ప్లాన్‌ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్‌‍్డ జెండర్‌ అయినా ఫరవాలేదని.. తన కోసం సూటయ్యే పేరును ఇప్పటికే ఎంపిక చేశానని చెప్పుకొచ్చారు. కాగా దేవ్‌ డీ, రిబ్బన్‌, గల్లీబాయ్‌ వంటి పలు చిత్రాల్లో నటించిన కల్కి.. బాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2015లో వీరిద్దరు సామరస్యపూర్వకంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు చెందిన పియానిస్ట్‌ గయ్‌తో సహజీవనం చేస్తున్న కల్కి.. మాతృత్వాన్ని ఆస్వాదించే సమయం వచ్చినందున బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇక పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతుండటం గురించి కల్కి మాట్లాడుతూ.. ‘నా బిడ్డతో ఎప్పుడు కనెక్ట్‌ అవాలో నాకు తెలుసు. ఇందుకోసం ప్రత్యేక నియమ నిబంధనలు ఏవీ పెట్టుకోలేదు. తను ఆడైనా, మగ అయినా, గే అయినా నా ప్రేమలో తేడా ఉండదు. లింగవివక్ష వేళ్లూనుకుపోయిన ఈ ప్రపంచంలో నా బిడ్డ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పెరగాలన్నదే నా అభిమతం. తన కోసం ఇప్పటికే పేరును కూడా ఎంపిక చేశాను. గర్భవతిని అయ్యాక నాలో చాలా మార్పులు వచ్చాయి. నెమ్మదిగా నడుస్తున్నా. ఓపిక బాగా పెరిగింది. మాతృత్వంలో ఉన్న గొప్పదనం అంటే ఇదేనేమో. గోవాలో పురుడుపోసుకోవాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని తప్పు చేశానని.. ఇప్పుడు తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఇక అనురాగ్‌ కశ్యప్‌ కూడా భార్య నుంచి విడిపోయిన అనంతరం కల్కిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కల్కితో కూడా అతడి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా