ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ

16 Feb, 2019 01:42 IST|Sakshi
విజయ్‌ చిల్లా, సహస్ర, మొయినుద్దీన్, దయానంద్, ‘దిల్‌’ రమేశ్, మమ్ముట్టి, ఉమ, అశ్రిత, మహి. వి రాఘవ్, శ్రీమిత్ర చౌదరి

– కల్యాణ్‌రామ్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించారు. మహేశ్‌ కోనేరు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. ట్రైలర్‌ను లోతుగా గమనిస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది.

నివేదా థామస్‌ పాత్ర ఆధారంగానే సినిమా అంతా సాగుతుంది. ఆమె బాగా నటించారు. గుహన్‌గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ పక్కాగా ప్లాన్‌ చేసి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత మహేశ్‌ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లో చేద్దామనేంత బాగా నచ్చింది ఈ సినిమా స్క్రిప్ట్‌. అయితే పూర్తి కథ విని మహేశ్‌ నిర్మించడానికి రెడీ అయ్యారు. తమ్మిరాజుగారి సపోర్ట్‌ మర్చిపోలేనిది. మార్చి 1న సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి కథతో మిళితమైన థ్రిల్లర్‌ చిత్రమిది. సినిమాటోగ్రాఫర్‌ నుంచి దర్శకునిగా మారిన తర్వాత ఒక సినిమా కోసం టీమ్‌ ఎంత కష్టపడతారో అర్థం అయింది.

కల్యాణ్‌రామ్‌గారి యాక్టింగ్‌ సూపర్‌. ఒక వ్యక్తిగా ఆయన ఎంతగానో సపోర్ట్‌ చేశారు. నివేదా థామస్‌ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించారు. షాలినీ పాండే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాత మహేశ్‌గారికి థ్యాంక్స్‌. శేఖర్‌చంద్ర మంచి మ్యూజిక్‌ ఇచ్చారు’’ అన్నారు కె.వి. గుహన్‌. ‘‘కల్యాణ్‌రామ్‌గారి నటన, గుహన్‌గారి టేకింగ్, నివేదా, షాలినీల పెర్ఫార్మెన్స్‌... ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇది నాకు స్పెషల్‌ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు మహేశ్‌ కోనేరు. ‘‘118 అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. తక్కువ టైమ్‌లో చాలా ఎక్కువగా వర్క్‌ చేసిన చిత్రమిది. చాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు నివేధా థామస్‌.

మరిన్ని వార్తలు