ఈ కళ్యాణం... కమనీయం

6 Mar, 2016 22:22 IST|Sakshi
ఈ కళ్యాణం... కమనీయం

కొత్త సినిమా గురూ!
పెళ్లనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధుర ఘట్టం. పైగా భారతీయ వివాహ వ్యవస్థకో విశిష్ఠత కూడా ఉంది. ఈ వ్యవస్థ గొప్పదనాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయి. ‘సీతారామకల్యాణం’, ‘పెళ్లిపుస్తకం’, ‘మురారి’... ఇలా ఎన్నో సినిమాల్లో వివాహం అనేది జీవితంలో ఎంత అద్భుతమైన ఘట్టమో కళ్లకు కట్టినట్టు చూపించారు. తాజాగా నందినీ రెడ్డి కూడా కళ్యాణ వైభోగాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘కళ్యాణ వైభోగమే’.
 
కథేంటంటే... 23 ఏళ్ల శౌర్య (నాగశౌర్య) గేమింగ్ డిజైనర్. మిలియన్ డాలర్ కంపెనీ పెట్టి యూఎస్‌లో సెటిలైపోవాలన్నది డ్రీమ్. పెళ్లంటే నూరేళ్ల మంట అని అతని అభిప్రాయం. అందుకే అమ్మ (ఐశ్వర్య), నాన్న(రాజ్ మాదిరాజు)లు పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటాడు. అయినా ఓ రోజు తప్పక పెళ్లి చూపులకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ  దివ్య (మాళవికా నాయర్)ను చూస్తాడు. ఇద్దరికీ విడిగా మాట్లాడుకునే అవకాశం ఇస్తారు పెద్దలు. నాకీ పెళ్లి ఇష్టంలేదని ఆమె మొహం మీదే చెప్పేస్తాడు. దివ్వకు కూడా అదే అభిప్రాయం.

పెళ్లికి ముందు తల్లిదండ్రుల మాట... పెళ్లయ్యాక భర్త మాట వింటూ ఉండే భార్యలా.. తన కళ్ల ముందు కనిపించే అమ్మ (రాశి)లా ఉండకూడదు, ఇంకా ఏదో సాధించాలని తన ఫీలింగ్. ఇష్టం లేని పెళ్లిని ఆపడానికి శౌర్య, దివ్య తమ పెద్దలకు ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పి, ఎలాగోలా పెళ్లి సంబంధాన్ని తప్పిస్తారు. అది తప్పిపోయినా పెద్దలు మాత్రం ఇద్దరికీ పెళ్లి సంబంధాల వేటలో ఉంటారు. ఈ క్రమంలోనే  ఓ సందర్భంలో శౌర్య, దివ్యలు  ఓ రెస్టారెంట్‌లో కలుస్తారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్‌తో విడిపోవచ్చని వారి ప్లాన్. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అక్కడనుంచి మొదలవుతుంది అసలు కథ. వాళ్ల ఉద్దేశం. వాళ్లు అనుకున్నట్లే విడిపోయారా? లేక కలిసే ఉన్నారా? అనేది మిగతా కథ.

బలవంతంగా పెళ్లి చేసేద్దామనే ధోరణిలో ఉన్న పెద్దవాళ్లు, వాళ్లకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుని, అందులోంచి బయటపడటానికి ప్లాన్ వేసిన ఓ యువ జంట ఎన్ని కష్టాలు ఎదుర్కొందో నందినీ రె డ్డి ఆసక్తికరంగా  చూపించారు. ఆడవాళ్లంటే ఇంటికి పరిమితం కావాలనే  ఆలోచనతో ఉన్న హీరోయిన్ తండ్రి పాత్రలో  తమిళ నటుడు ఆనంద్, అతని భార్యగా రాశి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో ఎప్పుడూ భార్యలే భర్తలకు వడ్డించాలా అని శౌర్య పట్టుబట్టి తన మావయ్య (ఆనంద్)తో అత్తయ్య(రాశి)కు వడ్డించేలా చేస్తాడు. పెళ్లయిన ఇన్నేళ్లలో ‘ఎప్పుడూ తనను తిన్నావా’ అని అడగని భర్త అలా వడ్డించడంతో చెమర్చిన కళ్లు, తర్వాత శౌర్య ‘తినండి అత్తయ్యా’ అంటూ వడ్డిస్తుంటే రాలిన ఆనందబాష్పాలతో ‘చాలు బాబు...’ అంటూ రాశి కనబర్చిన నటన టచింగ్‌గా ఉంటుంది.

తండ్రికి భయపడే అమ్మాయిగా, జీవితంపట్ల స్పష్టమైన ఆలోచన గల యువతిగా మాళవిక, లైఫ్ అంటే జాలీ రైడ్ అనుకునే శౌర్యగా నాగశౌర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించే ప్రగతి ఈ సినిమాలో ఐపాడ్ అమ్మక్కగా నవ్వులు పూయించారు. పతాక సన్నివేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తాగుబోతు రమేశ్, జీహెచ్‌ఎంసి వ్యాన్ డ్రైవర్‌గా ఆశిష్ విద్యార్థి నవ్వించడం కొసమెరుపు. ‘అలా మొదలైంది’ ఆనవాళ్లు అక్కడక్కడా కనిపించినా, తనదైన టేకింగ్‌తో వాటిని ప్రేక్షకుల మనసుల్లోంచి తుడిచేసే ప్రయత్నం చేశారు దర్శకురాలు. కళ్యాణి కోడూరి స్వరపరిచిన పాటల్లో పెళ్లి పాట గుర్తుండిపోతుంది. డబుల్ మీనింగ్ కామెడీ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో హృదయానికి హత్తుకునేలా, సకుటుంబ సపరివారాన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టని ఈ కల్యాణ వైభోగం నవరసభరితం.