మొదట ఈ విషయం ఎవరికీ తెలీదు!

23 Feb, 2016 22:55 IST|Sakshi
మొదట ఈ విషయం ఎవరికీ తెలీదు!

 - నిర్మాత దామోదర్ ప్రసాద్
 ‘‘నా సినిమాలో కథకు తగ్గట్టే నటీనటులు ఉంటారు. మా బ్యానర్‌లో గతంలో వచ్చిన సినిమాలకు దీటుగా ఈ ‘కళ్యాణ వైభోగమే’ ఉంటుంది’’ అని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా ఆయన నిర్మించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’.  ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను హైదరాబాద్‌లో విలేఖరులతో మంగళవారం పంచుకున్నారు. ‘‘కథ అంతా విన్నాక, స్క్రిప్ట్ రెడీ అయ్యేంతవరకు నేను ఆ సినిమా గురించి మాట్లాడను.
 
  ప్రత్యేకించి ఈ సినిమా కోసం 14 నెలలు వర్క్ చేశాను. ‘అలా మొదలైంది’ తర్వాత దర్శకురాలు నందినీరెడ్డి, నేను కలసి చేస్తున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. కళ్యాణ్ కోడూరి స్వరాలందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో పెళ్లి పాట అందరికీ కనెక్ట్ అయింది. మేం సినిమా చేస్తున్నట్టు చాలా మందికి తెలీదు. కానీ సినిమా పూర్తయి, సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చాక ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఓ అందమైన ప్రేమకథ ఇది. ఈ తరానికి తగ్గట్టు పూర్తిగా వినోదాన్ని మేళవించి, ఈ కథను తెరకెక్కించాం’’ అని దామోదర్ ప్రసాద్ తెలిపారు.