కొత్త కల్యాణ్‌రామ్‌ కనపడతాడు

31 Jul, 2017 00:51 IST|Sakshi
కొత్త కల్యాణ్‌రామ్‌ కనపడతాడు

‘‘పదమూడేళ్లుగా డిఫరెంట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తున్నా. అయితే... ఎప్పట్నుంచో మంచి రొమాంటిక్‌ కామెడీ సిన్మాలో నటించాలని నా కోరిక. సరిగ్గా జయేంద్రగారు అటువంటి స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమా నాకో ఛేంజ్‌ ఓవర్‌. ఇందులో కొత్త కల్యాణ్‌రామ్‌ కనపడతాడని గట్టిగా నమ్ముతున్నా’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌.

జయేంద్ర దర్శకత్వంలో ఆయన హీరోగా మహేశ్‌ కోనేరు సమర్పణలో కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి నిర్మించనున్న సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో ఎన్టీఆర్‌ క్లాప్‌ ఇచ్చారు. క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ స్క్రిప్టును దర్శకుడికి అందించారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో వర్క్‌ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాతో ఐశ్వర్యలక్ష్మిని తెలుగుకు హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు.

‘‘ఆగస్టు 5న ఏర్కాడ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ మొదలవుతుంది. మూడు రోజులు అక్కడ చిత్రీకరణ జరిపిన తర్వాత ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ చివరి వరకు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు మహేశ్‌ కోనేరు. ఈ కార్యక్రమంలో చిత్ర–నిర్మాతలు విజయ్‌కుమార్‌ వట్టికూటి, కిరణ్‌ ముప్పవరపు, సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్, హీరోయిన్‌ ఐశ్వర్యలక్ష్మి, సంగీత దర్శకుడు శరత్, రచయిత సుభా తదితరులు పాల్గొన్నారు.