షూటింగ్‌లతో కమల్‌ బిజీ 

10 May, 2019 09:08 IST|Sakshi

పెరంబూరు: నటుడు కమలహాసన్‌ మళ్లీ వెండితెర, బుల్లితెర షూటింగ్‌లతో బిజీ అయిపోయారు. ఈయన రాజకీయ రంగప్రవేశం చేసి మక్కళ్‌ నీది మయ్యం పేరుతో పార్టీని స్థాపించి వెనువెంటనే లోక్‌సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన కమలహాసన్‌ ఇప్పుడు ఈ నెల 19న జరగనున్న శాసనసభ ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్లీ సినీ, టీవీ షూటింగ్‌లకు రెడీ అయిపోయారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు తాను సినిమాలకు దూరం కానని, నటన తన వృత్తి అని ప్రకటించిన కమలహాసన్‌ ఆ తరువాత రాజకీయాల కోసం నటనను వదిలేస్తానని చెప్పారు. అంతే కాదు ఇండియన్‌–2నే తన చివరి చిత్రం అని కూడా ప్రకటించారు. అలాంటిది ఆ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించి కొన్ని రోజులు నటించి నిలిపేసి రాజకీయాలపై దృష్టి సారించారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి రెడీ
కమలహాసన్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో రెండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా సీజన్‌–3 ప్రారంభం కానుంది. దీనికీ కమలహాసన్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన పనులు చక చకా సైలెంట్‌గా జరిగిపోతున్నాయి. అందులో భాగంగా బిగ్‌బాస్‌ సీజన్‌–3 ప్రొమో షూటింగ్‌ చెన్నైలో బుధ, గురువారాల్లో జరిగింది. ఇందులో కమలహాసన్‌ పాల్గొన్నారు. ఈ సీజన్‌–3లో పాల్గొనే  సభ్యల ఎంపిక జరుగుతోంది. జూన్‌ నెల రెండో వారంలో బిగ్‌బాస్‌ సీజన్‌–3 టీవీలో ప్రసారం కానుంది.

దేవర్‌మగన్‌–2కు సిద్ధం
కమలహాసన్‌ మరో పక్క దేవర్‌ మగన్‌–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని తెలిసింది. దీన్ని మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ నిర్మించనున్నట్లు సమాచారం. 

కమల్‌ ప్రచారంపై నిషేధం విధించండి
కమలహాసన్‌ సినీ, బుల్లితెర విషయాలు ఇలా ఉండగా, రాజకీయ వ్యవహారం చూస్తే శాసనసభ ఉప ఎన్నికల్లో భాగంగా సూలూర్‌లో ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. తిరుపూర్‌ జిల్లా, పణపాలైయంకు చెందిన బాలమురుగన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పల్లడం బూత్‌కమిటీ సభ్యుడిగా పని చేశారు. గత నెల 18వ తేదీన బూత్‌కమిటీ వద్దకు వెళ్లిన బాలమురుగన్‌ పార్టీ కార్యాలయం పైభాగంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఆయన భార్య, పిల్లలు గురువారం కోవై కలెక్టర్‌ను కలిసి ఒక పిటిషన్‌ను అందించారు. అందులో.. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా కోరారు. అదేవిధంగా కమలహాసన్‌ ఉప ఎన్నికల్లో భాగంగా తన పార్టీ అభ్యర్థికి మద్దతుగా సూలూర్‌లో ప్రచారానికి రానున్నట్లు తెలిసిందన్నారు. ఆయన ప్రచారంపై నిషేధం విధించాలని అందులో కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల గురించి పట్టించుకోని కమలహాసన్‌ రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు