అందుకు సమయం ఆసన్నమైంది!

31 Jul, 2018 10:28 IST|Sakshi

తమిళసినిమా: రాజకీయ పత్యర్ధి ఎవరన్నది నిర్ణయించుకునే సమయం అసన్నమయ్యిందని నటుడు, మక్కళ్‌ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తూనే, మరో పక్క సినిమాలు, బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో వంటి కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారు. కమల్‌ నటించిన విశ్వరూపం– 2 చిత్రం ఆగస్ట్‌ 10న విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి ఇండియన్‌–2 చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఆగిన శబాష్‌ నాయుడు చిత్రాన్ని పూర్తి చేసే ప్రయత్నంలోనూ ఉన్నారు. బిగ్‌బాస్‌ గేమ్‌ షో కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శనివారం బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో పాల్గొన్న కమలహాసన్‌ షో మధ్యలో ప్రేక్షకుల ప్రశ్నలకు బదులిచ్చారు. అవేంటో చూద్దాం..

ప్ర: ఇండియన్‌ –2 చిత్రం తరువాత నటనకు స్వస్తి చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుందే..?
జ: అలాగని మీరే చెప్పుకుంటున్నారు. కాలమే దాన్ని నిర్ణయిస్తుంది.

ప్ర: అయితే మీరు పూర్తి రాజకీయవాదిగా మారారా?
జ: ఇక్కడ పూర్తి స్థాయి రాజకీయవాది ఎవరో ఒక్కరిని చూపండి. నేను మొదట మనిషిని. తరువాత కళాకారుడిని. ప్రతి వారికీ వ్యక్తిగత జీవితం ఉండాలి. బ్రిటీష్‌ వారి కాలంలో త్యాగంతో కూడిన రాజకీయాలు వేరు. ఇప్పుడు అలా నటించాల్సిన అవసరం లేదు. ఇది తప్పు కాదు. నేనూ ఇందుకు అతీతుడినీ కాదు.

ప్ర: బిగ్‌బాస్‌ కార్యక్రమానికి, సమజానికి ఏమైనా సంబంధం ఉందా?
జ: మన ఒక్కో పాత ఆచారం వెనుక పలు కారణాలు, ఉద్ధేశాలు ఉంటాయి. వాటిని నేరుగా చెబితే ప్రజలు ఆచరించరని, మతం ద్వారా చెబుతుంటారు. రాజు ఆజ్ఞను పాటించడానికి మతమే మార్గం అని చిన్నతనంలో నేనే రాశాను. కాబట్టి బిగ్‌బాస్‌ కార్యక్రమానికి, సమాజానికి కచ్చితంగా సంబంధం ఉంది. అందుకే మీరు చూస్తున్నారు.

ప్ర: మీకు ఇష్టమైన పోటీదారుడు ఎవరు?
జ: మీకు నచ్చిన వారు ఎవరన్నది వారం వారం మారిపోతుంటారు కదా! కాబట్టి అది నేనెలా చెప్పగలను. గత రెండేళ్లుగా సహిస్తున్న ప్రజలే నాకు నచ్చినవారు. ఇకపోతే ఎలాంటి ఆటలోనైనా తన పోటీదారుడు ఎవరన్నది నిర్ణయించుకోవాలి. మరికొద్ది రోజుల్లో నేనూ అది చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది.. అంటూ తన రాజకీయ పత్యర్ధి ఎవరన్నది నిర్ణయించుకునే సమయం ఆసన్నమయ్యిందని కమల్‌ నర్మగర్భంగా అన్నారు.

మరిన్ని వార్తలు