‘సినిమా’ వదులుకునే ప్రసక్తే లేదు

26 Jul, 2018 12:26 IST|Sakshi

కమల్‌ వ్యాఖ్య విశ్వరూపం–3కి సిద్ధం

ఒక్క రూపాయితో ప్రజా సేవ కష్టతరమే

సాక్షి, చెన్నై : రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని విశ్వనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ వ్యాఖ్యానించారు. విశ్వరూపం–2 సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ చేయడం కష్టతరమేనన్నారు. కమల్‌ నటించి, రూపొందించిన విశ్వరూపం–2 ఆగస్టు పదో తేదీన తెరమీదకు రానుంది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నైలో కమల్‌ మీడియాతో మాట్లాడారు. విశ్వరూపం–2 కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నా, దశావతారం, మన్మ«థ అంబు వైపు తన పయనం సాగిందన్నారు. దేశం రెండుగా చీలడానికి ప్రధాన కారణం మత రాజకీయాలేనన్న అంశం మేరకు ఈ కథ పుట్టుకొచ్చిందన్నారు.

ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదని, అమెరికాకు వత్తాసు పలికే పరిస్థితులు, అంశాలు లేవని స్పష్టంచేశారు. అమెరికా, తీవ్రవాదుల మధ్య ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించే చిత్రంగా విశ్వరూపం–2 ఉంటుందన్నారు. ఈ చిత్రం సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధం అని వ్యాఖ్యానించారు. విశ్వరూపం–1 విడుదల సమయంలో పెద్ద వ్యతిరేకతే బయలుదేరిందని గుర్తుచేస్తూ, ఆ పరిస్థితి ప్రస్తుతం రాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పార్టీ గురించి, తన పార్టీ జెండాలు, ఇతర అంశాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదన్నారు. ఎంజీఆర్‌ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కాలంలో సాంకేతిక అభివృద్ధి లేదని, అందుకే ఆయన తన చిత్రాల్లో జెండాను చూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అనేక మార్గాలు ప్రచారాలకు ఉన్నాయన్నారు. ఎంజీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేస్తూ, తానూ రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఉంటానని పేర్కొంటూ, ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ సాగించడం  కష్టతరమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 

మరిన్ని వార్తలు