గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో కమల్‌?

12 Mar, 2020 09:06 IST|Sakshi

చెన్నై :  హీరో కమలహాసన్‌ను దర్శకుడు గౌతమ్‌మీనన్‌ మరోసారి డైరెక్ట్‌ చేయనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌లో వస్తోంది. గౌతమ్‌మీనన్‌ ఇంతకుముందు పలు సంచలన చిత్రాలను తెరకెక్కించారు. కాక్క కాక్క, విన్నైతాండి వరువాయా, మిన్నలే ఇలా విజయవంతమైన చిత్రాలు ఈయన దర్శకత్వంలో వచ్చినవే. అలాంటి వాటిలో కమలహాసన్‌ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఒకటి. కమలహాసన్‌ పోలీస్‌అధికారిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా వేట్టైయాడు విళైయాడు చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం గురించి కమలహాసన్, దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఇటీవల చర్చలు జరిపినట్లు తెలిసింది.

కాగా ప్రస్తుతం కమలహాసన్‌ ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కారణంగా ఇండియన్‌–2 చిత్రం షూటింగ్‌ నిలిపి వేశారు. మళ్లీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత కమలహాసన్‌ రాజకీయపనుల్లో బిజీ అవుతారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తన మక్కళ్‌ నీది మయ్యం పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

దీంతో ఎన్నికలు దగ్గర పడుతుండడంలో కమలహాసన్‌ ఆ పనుల్లోనే ఉంటారు. దీంతో ఒక వేళ గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించినా, ఆ చిత్రం ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశం లేదు. బహూశా శాసనసభ ఎన్నికలు ముగిసిన తరువాత వైట్టైయాడు విళైయాడు–2 చిత్రం ఉండవచ్చు. అదే విధంగా కమలహాసన్‌ తలైవన్‌ ఇరుకిండ్రాన్‌ చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. అదేవిధంగా దేవర్‌మగన్‌–2 కూడా చేస్తానని చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు సెట్‌పైకి వస్తాయన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇక దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ప్రస్తుతం నటనపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఆయన విక్రమ్‌ హీరోగా చేసిన ధ్రువనక్షత్రం పూర్తి కాలేదు. అదేవిధంగా తెలుగు చిత్రం పెళ్లిచూపులును రీమేక్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా శింబు హీరోగా విన్నైతాండి వరువాయా–2 చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్‌తో వేట్టైయాడు విళైయాడు 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు