ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

12 Dec, 2016 15:20 IST|Sakshi
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఈతరం ప్రేక్షకులకు కాంచన అనగానే, ఆ పేరుతో వచ్చిన హిట్ సినిమా గుర్తొస్తుంది. నిన్నటి తరం ప్రేక్షకులకు మాత్రం పెద్ద హీరోయిన్ గుర్తొస్తుంది. 1960, ’70లలో దక్షిణాది ప్రేక్షకుల కలలరాణి, ఎన్టీయార్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు తదితరులతో సినిమాలు చేసిన స్టార్ హీరోయన్ ఆమె. చాలాఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకుంటున్నారు. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అర్జున్‌రెడ్డి’లో ఆమె నటిస్తున్నారు. కొన్ని రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. త్వరలో ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దర్శకుడు సందీప్ వంగా ‘సాక్షి’ సినిమాతో మాట్లాడుతూ -‘‘మూడేళ్ల క్రితం టీవీలో కాంచనగారి ఇంటర్వ్యూ చూశా. ఆమెను దృష్టిలో పెట్టుకునే కథ రాశా. కాల్ చేసి అడిగితే, ఆలోచిస్తా అన్నారామె. మళ్లీ మళ్లీ కాల్ చేశా. నేనూ, విజయ్ చెన్నై వెళ్లి కథ చెప్పిన తర్వాత నేనెందుకు పట్టుబట్టానో ఆమెకు అర్థమైంది’’ అని చెప్పారు.

కాంచనగారి పాత్ర ఎలా ఉంటుంది? అని అడిగితే.. ‘‘సినిమాటిక్ బామ్మలా కాకుండా మోడ్రన్ బామ్మలా ఉంటుంది. సాధారణంగా మనవలు ఏదైనా తప్పు చేస్తే, నానమ్మలు బాధపడడమో, తిట్టడమో చేస్తారు. పాతికేళ్ల కుర్రాడు ఏ పరిస్థితుల్లో అలా చేశాడనేది మా సినిమాలో నానమ్మ అర్థం చేసుకుంటుంది’’ అన్నారు. శాలిని హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా దిశా శర్మ, కీలకపాత్రలో హీరో మహేశ్‌బాబు బావ సంజయ్ స్వరూప్ నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా