మహిళలకు సెల్యూట్

26 Oct, 2015 23:36 IST|Sakshi
మహిళలకు సెల్యూట్

క్రిష్ చిత్రాల్లోని కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. టేకింగ్... మేకింగ్ బాగుంటాయి. అందుకే‘కంటెంట్ ఉన్న దర్శకుడు’ అనిపించుకోగలిగాడు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణ్ణం వందే జగద్గురుమ్’ వంటి వినూత్న కథలను ఆవిష్కరించిన క్రిష్ తాజాగా ‘కంచె’ అన్నారు. వరుణ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రంగత వారం విడుదలైన విషయం తెలిసిందే. గత మూడు చిత్రాలు ఒక ఎత్తయితే... ఈ చిత్రం మరో ఎత్తు అంటున్నారు క్రిష్. మరిన్ని విశేషాలు ...
 
ఇక్కడ మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ‘కంచె’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని అనువదించి, విడుదల చేయడానికి ఇతర భాషలవాళ్లు ముందుకు వస్తున్నారు. నాకు మాత్రం హిందీలో అనువదించాలని లేదు. రీమేక్ చేయాలని ఉంది.

 
‘గమ్యం’ నుంచి ‘కంచె’ దాకా ఒక్కసారి మీ కెరీర్‌ను విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది?
 ‘గమ్యం’ నుంచి ‘కంచె’కి ముందు దాకా తీసిన సినిమాలు ఒక ఎత్తు. ‘కంచె’ మరో ఎత్తు అని చెప్పాలి.

ఎందుకలా అంటున్నారు?
కమర్షియల్‌గా ‘కంచె’ సాధిస్తున్న విజయాన్ని ఉద్దేశించి అలా అంటున్నాను. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వసూళ్లు బాగున్నాయని చెబుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంది. ఈ చిత్రాన్ని మహిళా ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. కొంతమంది స్వయంగా ఫోన్ చేసి, ‘ఎంత మంచి సినిమా తీశావ్’ అని అభినందిస్తున్నారు. ‘ఆఫ్ట్రాల్ ఆడది..’, ‘గర్భాన్ని వాడుకుని వదిలేస్తారు’, ‘ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.. కానీ, ఏ దేశంలో అయినా అమ్మతనం ఒకేలా ఉంటుంది..’ అనే డైలాగ్స్‌తో వచ్చే సన్నివేశాలు చాలా టచింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. ఒకావిడ అయితే, ఈ సినిమాలోని సన్నివేశాలు తనను వెంటాడుతున్నాయంటూ ఉద్వేగానికి గురవుతూ చెప్పడం మర్చిపోలేని విషయం. అందుకే, ఈ సినిమా విజయం తాలూకు క్రెడిట్‌ను ఎక్కువగా మహిళలకు ఇస్తున్నా. వాళ్లకు సెల్యూట్ చేస్తున్నా.
 
క్రిష్ సినిమాలు బాగున్నా కమర్షియల్‌గా పెద్ద వర్కవుట్ కావనే అభిప్రాయాన్ని ‘కంచె’ తొలగించిందంటారా?
అవును. ‘కంచె’ సాధిస్తున్న వసూళ్లే అందుకు సరైన సమాధానం. విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో ఆదివారం వరకూ సాధించిన వసూళ్లు మూడున్నర కోట్ల రూపాయలు. సోమవారం కూడా వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని కొన్న ప్రతి బయ్యర్, ఎగ్జిబిటర్ హ్యాపీ. సేఫ్ జోన్‌లోకొచ్చేశారు. ‘క్రిష్ మంచి సినిమాలు తీస్తాడు. డబ్బులు కూడా బాగా వస్తే బాగుంటుంది’ అనుకునేవాళ్లందరూ ‘కంచె’ సాధిస్తున్న వసూళ్లు గురించి విని, ఆనందపడుతున్నారు.
 
‘కంచె’లో ధూపాటి హరిబాబు, సీతాదేవిల లవ్‌స్టోరీ చూసినప్పుడు, మీరు ప్రేమకథలను బాగా తీయగలరనిపించింది. మరి ప్యూర్ లవ్‌స్టోరీ ఎప్పుడు?
నాకు లవ్‌స్టోరీస్ తీయడం ఇష్టం. ‘గమ్యం, కంచె’ అలాంటివే. భవిష్యత్తులో కూడా ప్రేమకథా చిత్రాలు తీస్తా. లేకపోతే ప్రేమ గురించి చెబుతా.
 
మీ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. అది సింపుల్‌గా ఉంటేనే మీ సినిమా అందరికీ రీచ్ అవుతుందేమో. టేకింగ్, మేకింగ్ బాగున్నా సామాన్య జనానికి చేరువవుతున్నాయంటారా?
(నవ్వుతూ...) ఈ ప్రపంచంలో ఎవరూ సామాన్యులు కాదు. అందరూ మాన్యులే. సినిమా చూపించేవాళ్లకన్నా చూసేవాళ్లు ఇంకా మేధావులు. థియేటర్‌కు వచ్చేవాళ్లు ఓపెన్ మైండ్‌తో వస్తారు. వాళ్లు ‘గుండమ్మ కథ’ను చూస్తారు. ‘అవతార్’ కూడా వాళ్ళకు అర్థమవుతుంది. అయినా ప్రేక్షకుల స్థాయిని తక్కువ అంచనా వేయడానికి మనం ఎవరం? నా గాలి శీను (‘గమ్యం’లో అల్లరి నరేశ్ పాత్ర), బీటెక్ బాబు (‘కృష్ణం వందే జగద్గురుమ్’లో రానా పాత్ర), ఇప్పుడు ధూపాటి హరిబాబు (‘కంచె’లో వరుణ్ తేజ్ పాత్ర) అందరికీ నచ్చారు. ఆలోచన బలమైనదే అయినా, చూపించే విధానం తేలికగా ఉంటుంది కాబట్టి, నా చిత్రాలు జనరంజకంగా ఉంటాయి.
 
‘కంచె’లో వేరు వేరు కులానికి చెందిన హరిబాబు, సీతాదేవి మధ్య లవ్‌ట్రాక్ పెట్టి, ప్రేమకు కులంతో సంబంధం లేదన్నారు. కానీ, రెండు పాత్రలు చనిపోయినట్లు చూపించడం ద్వారా వేరు వేరు కులాలకు చెందినవాళ్లు ప్రేమించుకుంటే చనిపోవాల్సిందేనా అని ఫీలయ్యే అవకాశం ఉంది కదా?
ఈ సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం సరికాదు. ఆ రెండు పాత్రలు అలా ముగిసిపోవడమే గొప్ప క్లయిమ్యాక్స్ అని నమ్మాను నేను. నేను నమ్మినది నిజమని ప్రేక్షకులు నిరూపించారు. ‘క్లయిమ్యాక్స్ మనసులో నిలిచిపోయిందండీ’ అంటున్నారు. దేశం కోసం భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీర మరణం పొంది, లెజెండ్స్ అయ్యారు. సైనికుడు ప్రాణాలు వదిలితేనే ఈ కథ చిరకాలం నిలిచిపోతుంది. అందుకే ఈ ముగింపు ఇచ్చాను. హీరో, హీరోయిన్‌లను చంపి, ఇంత ఆనందంగా మాట్లాడే దర్శకుడు ఎవరుంటారు చెప్పండి? దీన్నిబట్టే క్లయిమ్యాక్స్‌కి వస్తున్న స్పందన ఏంటో ఊహించవచ్చు. మా నాన్నగారైతే ‘ఇదీ సినిమా అంటే’ అన్నారు.
 
దర్శకుడిగా మీ టార్గెట్ ఏంటి?
నేను చేసే సినిమాకు ఇప్పుడు డబ్బులు రావాలి. ఇప్పుడు ఈ నాలుగు వారాలను టార్గెట్ చేసుకుని తీసే సినిమాలు నాలుగు దశాబ్దాల తర్వాత కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలి. అదే నా లక్ష్యం.
 
మీరు పుస్తకాలు బాగా చదువుతారనిపిస్తోంది. మీరు ఆదర్శంగా తీసుకునే ఇద్దరు రచయితల గురించి?
రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి)గారు, తిలక్ (దేవరకొండ బాలగంగాధర తిలక్)గారు నాకు చాలా ఇష్టం. రావి శాస్త్రిగారి రచనలు నాకు సమాజాన్ని, అందులో ఉండే రకరకాల మనస్తత్వాలను పరిచయం చేశాయి. తిలక్ రచనా శైలి నచ్చుతుంది. ఆయన పదాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల్లా అనిపిస్తాయి. రచనలు విప్లవాత్మకంగా ఉంటాయి. వాళ్ల మీద ఉన్న మమకారంతో వాళ్ల పేరు వచ్చేట్లుగా సినిమాలో ‘రాచకొండ సంతానం’ అనీ, ‘దేవరకొండ గ్రామం’ అనీ పెట్టాను.
 
ఇప్పటివరకూ మీరు తీసిన చిత్రాల్లో స్టోరీయే స్టార్. మరి... స్టార్ హీరోలతో చిత్రాలు చేసినప్పుడు?
అప్పుడు కూడా కథే స్టార్. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికి స్టార్ ఉపయోగపడతాడు. వచ్చినవాళ్లను కూర్చోబెట్టేది కథే. అందుకే స్టార్ మూవీ అయినా నాన్-స్టార్ మూవీ అయినా స్టోరీయే స్టార్‌గా ఉండాలి. అదే మంచిది.
 
‘కంచె’ కమర్షియల్‌గా కూడా విజయం సాధించింది కాబట్టి, స్టార్ హీరోలు మీతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారనుకోవచ్చా?
యాక్చువల్‌గా ‘కంచె’కి ముందు కూడా స్టార్ హీరోలు నాతో చేయడానికి రెడీగానే ఉన్నారు. నా శైలిలో సాగే కథాబలం ఉన్న చిత్రాలు చేయడానికి సుముఖత వ్యక్తపరిచారు. వాళ్ళకు కథలు తయారు చేసి, చెప్పాల్సింది నేనే.
 
మీ తదుపరి చిత్రాలు?
‘కంచె’ సక్సెస్‌ను ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. కొన్ని హిందీ చిత్రాలకు ఇప్పటికే సంతకాలు చేశా. తెలుగు ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు తరువాత చెబుతా.