ఎన్టీఆర్‌ బయోపిక్‌పై కంగన షాకింగ్‌ కామెంట్స్‌

25 Feb, 2019 19:04 IST|Sakshi

మణికర్ణిక సినిమా విషయంలో కంగన, క్రిష్‌ల మధ్య తలెత్తిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల క్రిష్‌ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రాలు(కథానాయకుడు, మహానాయకుడు) బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చిన సంగతి తెలిసిందే. మణికర్ణిక చిత్ర షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే క్రిష్‌, ఎన్టీఆర్‌ బయోపిక్‌కు దర్శకత్వం వహించడానికి అంగీకరించారు. తాజాగా క్రిష్‌ గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కంగన, క్రిష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘ఎన్టీఆర్‌ బయోపిక్‌ కలెక్షన్‌ల గురించి విన్నాను. ఇవి జీరో రికవరీగా నిలిచాయి. ఆ నటుడి జీవితంలో ఈ చిత్రం మచ్చగా మిగులుతుంది.  క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నేను క్రిష్‌ను ద్రోహం చేశానని చాలా మంది విమర్శలు చేశారు. నా వ్యక్తిత్వంపై దాడి చేయడమే కాకుండా.. నిందలు వేస్తూ రాబందుల్లా పీక్కు తిన్నారు. నాపై అనాలోచితంగా విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారు?. కమర్షియల్‌గా మణికర్ణిక చిత్రం విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. అటువంటి చిత్రంపై విమర్శలు చేస్తారా?. క్రిష్‌తో కొన్ని పెయిడ్‌ మీడియా సంస్థలు కూడా నాపై బురదజల్లడం సిగ్గుచేటు. స్వాతంత్ర సమరమోధులు.. ఇటువంటి వారి కోసం రక్తం ధారపోసినందుకు నిజంగా బాధగా ఉంద’ని కంగన తెలిపారు.

మరిన్ని వార్తలు